calender_icon.png 9 December, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా మాటే శాసనం..?

09-12-2025 12:00:00 AM

  1. పన్ను వసూళ్లలో అక్రమాలు?
  2. నిబంధనలకు విరుద్ధంగా పన్ను విధింపు 
  3. ట్యాక్స్ ఇన్స్ స్పెక్టర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల ఇష్టారాజ్యం 
  4. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మూడు సర్కిళ్లు 
  5. వీటి పరిధిలో అధికారులు చెప్పిందే వేదం 
  6. ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయానికి గండి 
  7. చోద్యం చూస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు

ఎల్బీనగర్, డిసెంబర్ 8 : ఎల్బీనగర్ జోనల్ లోని సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ సర్కిళ్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి పన్ను ముదింపులో నిబంధనల ప్రకారం కాకుండా నచ్చిన రీతిలో పన్ను విధిస్తున్నారు. కొత్త ఇంటికి ఇంటి నెంబరు కేటాయింపు, కమర్షియల్ కాంప్లెక్స్ భవనాలను ఆస్తి పన్ను విధింపులో జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ట్యాక్స్ విధింపులో రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిర్మాణదారుల నుంచి అందినకాడికి తీసుకుని తక్కువ పన్ను విధించి, ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమాలపై విచారణ చేపట్టాల్సిన జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అధికారులు ట్యాక్స్ వసూళ్లలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు, ట్యాక్స్ ఇన్స్ స్పెక్టర్ల కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా నడుస్తున్నట్లు  జోరుగా చర్చ జరుగుతుంది. అధికారులకు నచ్చితే తక్కువ.. నచ్చకపోతే ఎక్కువ పన్ను ముదింపు.. అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. చెప్పినట్లు వినకపోతే నెలల తరబడి ఫైళ్లను పక్కన పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పన్ను విధింపులో నిబంధనలకు నీళ్లు 

ఎల్బీనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ పరిధిలో ట్యాక్స్ వసూళ్లు, ట్యాక్స్ విధింపులో అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ప్రభుత్వానికి చేరాల్సిన కోట్లాది రూపాయల ప్రజాధనానికి ట్యాక్స్ ఇన్స్ స్పెక్టర్లు, ఇన్ చార్జి ఏఎంసీలు, డీసీలు గండికొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ సర్కిళ్ల లోని ఆయా డివిజన్ పరిధిలో నూతన నిర్మాణాలు, కమర్షియల్ బిల్డింగ్ యజమానుల నుంచి ఆస్తి పన్ను పేరుతో ప్రతి ఏడాది జీహెచ్‌ఎంసీ అధికారులు పన్ను వసూలు చేస్తారు.

అయితే, వసూలు చేసిన ప్రజాధనంపై కాకి లెక్కలు చూపుతూ కొంత భాగాన్ని అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కమర్షియల్ జోన్ల పరిధిని బట్టి ట్యాక్స్ విధించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక వాణిజ్య భవనానికి నిబంధనలు ప్రకారం కాకుండా తమకు నచ్చిన విధంగా ట్యాక్స్ విధిస్తున్నారు.

ఒక్కో కమర్షియల్ బిల్డింగ్ పై లక్ష రూపాయలు ప్రజాధనాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఒకటి.. రెండు కమర్షియల్ భవనాల వద్దనే లక్షల రూపాయల ట్యాక్స్ వసూళ్లలో గోల్ మాల్ జరిగితే.. ఇక మొత్తం మూడు సర్కిళ్ల పరిధిలో ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంటుందో.. అర్థం చేసుకోవచ్చని ప్రజలు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. 

విజిలెన్స్ అధికారులు ఉన్నట్టా.  లేనట్టా..?

ట్యాక్స్ రూపంలో జీహెచ్‌ఎంసీకి ఆదాయం సమకూరు తుంది. ఈ ఆదాయం వేల కోట్లలో ఉంటుంది. దీని ద్వారానే  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించబడ తాయి. అయితే, ట్యాక్స్ వసూళ్లలో పారదర్శకంగా ఉండాల్సిన కొంత మంది ట్యాక్స్ ఇన్స్ స్పెక్టర్లు, ఏఎంసీలు, డిప్యూటీ కమిషనర్లు  ప్రజాధనానికి తూట్లు పొడుస్తూ అక్రమార్గంలో సంపాదన కోసం అవినీతికి పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అందులో భాగంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ఇలాంటి ఆరోపణలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి విచారణ జరపాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు స్పందించడం లేదు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు  పన్ను విధింపు, పన్ను వసూళ్లలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.