16-12-2025 01:32:29 AM
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ర్టంలో ఇక కాలం చెల్లిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఈ విషయాన్ని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా తేల్చి చెప్పారని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమ వారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో నూ -అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపా రు.
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తాచాటిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ర్టంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన మోసాలే, కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారుతున్నాయని తెలిపారు.
పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రం చేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంప పెట్టులాంటివని తెలిపారు.
ఫలితాలు ప్రజాగ్రహానికి సంకేతాలు
నాడు బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, పల్లె పల్లెనా అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందన్నారు. ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.
రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్‌ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి పాదాభివందనలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబందహస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుందని స్పష్టం చేశారు.