16-12-2025 01:34:15 AM
అభ్యంతరాలతో కిక్కిరిసిన శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం
శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన డివిజన్లు, వార్డుల పునర్విభజన అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజు కావడంతో సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం ప్రజాప్రతినిధులతో కిక్కిరిసిపోయింది.
శేరిలింగంపల్లి, పటాన్చెరు నియోజకవర్గాలతో పాటు విలీన మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేకు అందజేశారు.
డివిజన్ల విభజనలో స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం, సరిహద్దుల నిర్ణయంలో గందరగోళం నెలకొనడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు.జనాభా ప్రాతిపదికపై స్పష్టత కోరిన ప్రతినిధులు
డివిజన్ల విభజన జనాభా ప్రాతిపదికనా? ఓటర్ల జాబితా ఆధారమా? లేక మరేదైనా ప్రమాణమా? అన్నది ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రతిపాదనల దశలో ప్రజల నుంచి గానీ, రాజకీయ పార్టీల నుంచి గానీ సూచనలు తీసుకోకుండా సరిహద్దులు నిర్ణయించడం సరికాదన్నారు. ఇచ్చిన సరిహద్దుల్లో ఏ కాలనీ, ఏ బస్తీ ఏ డివిజన్ పరిధిలోకి వస్తుందన్న విషయంపైనా స్పష్టత లేదని పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి డివిజ్ప అభ్యంతరాలు శేరిలింగంపల్లి డివిజన్లో దాదాపు 70 వేల ఓటర్లు యథాతథంగా ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన మసీద్బండ డివిజన్లో కేవలం 12 బూతులు, సుమారు 15 వేల ఓట్లు మాత్రమే బదలాయించారని అభ్యంతరం తెలిపారు. పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఆరంభ టౌన్షిప్, సందయ్య నగర్, సురభి కాలనీతో పాటు గోపీ చెరువు నాలా నుంచి చాకలి చెరువు నాలా మీదుగా అరబిందో గ్రేటర్ కమ్యూనిటీ ప్రాంతాలను మసీద్బండ డివిజన్లో కలపాలని డిమాండ్ చేశారు. మాతృశ్రీ నగర్ డివిజన్ సరిహద్దుల ఏర్పాటు కూడా గందరగోళంగా ఉందని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ డిమాండ్లు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో కొంత భాగాన్ని వేరే వార్డులో విలీనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతంలో వేలాదిగా ప్రజలు, ఓటర్లు ఉన్నందున దానిని రెండు వార్డులుగా విభజించాలని కోరారు. పటాన్చెరు సర్కిల్లో జేపీ నగర్ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు. విలీన మున్సిపాలిటీల అభ్యర్థనలు
అమీన్పూర్ మున్సిపాలిటీలో 1.20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క వార్డుకే పరిమితం చేయడాన్ని తప్పుబట్టారు. జనాభా ప్రాతిపదికన మరో రెండు వార్డులు అవసరమని అభ్యర్థించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అదనంగా మరో వార్డు ఏర్పాటు చేయాలని కోరారు. భౌగోళికంగా శేరిలింగంపల్లికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలను కూకట్పల్లి జోన్లో కలపడం పరిపాలనా అసౌకర్యాలకు దారితీస్తుందని, వాటిని శేరిలింగంపల్లి జోన్లోనే కొనసాగించాలని సూచించారు.
విలీన మున్సిపాలిటీలకు సమీపంలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.బీజేపీ వినతి ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
డివిజన్ల విభజనలో స్పష్టత లేకుంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతుందని, రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం తప్పదని పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన బీకే ఎన్క్లేవ్ వార్డు పేరును మక్తాగా మార్చాలని కూడా ఆయన కోరారు.ప్రజాప్రతినిధులు సమర్పించిన అన్ని అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిస్తామని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే తెలిపారు.