calender_icon.png 20 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాలు కాపాడండి ప్లీజ్... సార్లు

20-08-2025 01:00:11 AM

మూడు వేల ఎకరాలకుపైగా పంట మునక

పట్టించుకోని నీటిపారుదల శాఖ అధికారులు 

ఆవేదన వ్యక్తం చేస్తున్నా రైతులు 

ఎమ్మెల్యేకు, అధికారులకు విన్నవించిన ఫలితం లేదు

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ తో మునిగిన వరి పంటలు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని రైతులు వరి పంట వేల ఎకరాల్లో నీట మునిగి రైతులు ఆందోళన స్థానిక ఎమ్మెల్యే కు, నీటిపారుదల శాఖ అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో రైతులు పంటలు నీట మునగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు సుమారు 20 గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలు మూడు వేల ఎకరాల వరకు ఎగువ నుండి వస్తున్న భారీ వరద, సింగూరు ప్రాజెక్టు నుండి 43 వేల క్యూసెక్కులు, హల్దీ వాగు నుండి 40,000 క్యూసెక్కులు, ఘనపూర్ వాగు నుండి 15వేల క్యూసెక్కులు పోచారం ప్రాజెక్టు నుండి ఏడున్నర వేల క్యూసెక్కులు మంజీరా నది గుండా, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది.

నిజాంసాగర్ ఆయకట్టు సామర్థ్యం, 1405 అడుగులకు,1403.70 ఫిట్,17.802 టీఎంసీలకు అయినప్పటికీ, మంగళవారం మధ్యాహ్నం, వరకు, 15.943 టీఎంసీలు, నీరు నిల్వ చేరింది. అయినప్పటికీ ఎగువ నుండి వస్తున్న భారీ వరదను దిగువకు వదిలినట్లయితే ఎగువన ఉన్న మoజీర నది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల పంట పొలాలు వేలాది ఎకరాలలో పంట ముంపు నుండి రైతులు గట్టెక్కే అవకాశం ఉంది. 

 నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం అవేవీ  పట్టించుకోకుండా సాస మేరా చేస్తున్నారు. నిజాంసాగర్ ఆయకట్టుకు కావలసిన 1405 అడుగుల నీటికి, అంటే 17 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలని లక్ష్యంతో ఆయకట్టులో అధికంగా నీటిని నిల్వ ఉంచి విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి 1, 20,000 క్యూసెక్కుల నీరు భారీ వరద వచ్చినప్పటికీ 85,000 క్యూసెక్కుల నీరు వదులుతూ 40 వేల క్యూసెక్కుల నీరును ప్రాజెక్టులు నిలువ చేస్తూ ఎగువన ఉన్న మాంజీర నది పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలు నీట మున గడంతో రైతులు నష్ట పోతున్నారు. నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు చెప్పేదొకటి చేసేదొకటి

15 గేట్ల ద్వారా నీరు విడుదల చేసామని అధికారులు చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం ఆచరించడం లేదు. ఒక్కో గేటు నుంచి  566 క్యూసెక్కుల నీరును విడుదల చేస్తూ 15 గేట్లు ఎత్తినామంటూ చేతులు దులుపుకున్నారు.  తమ పని తాము చేసుకుంటూ రైతుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా వర్షాకాలం పూర్తి కాలేదు. వర్షాలు భారీగా కురుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిని భారీ వరద ఒక వైపు వస్తు నింపుతూ మరోవైపు కొద్ది మేర నీటిని వదులు తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాల రైతులు వరి పంట పొలాలు నీట మునిగి తీవ్ర ఆందోళన చెందినప్పటికీ పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు రైతులు తమ మొరను విన్నవించిన పట్టించుకునే పాపాన అధికారులు పోవడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం, 29.917 టీఎంసీలు కాగా ప్రాజెక్టు స్వల్ప ప్రమాదం ఉన్నప్పటికీ ముందస్తుగా అధికారులు గుర్తించి 19.534 టీఎంసీల నీటిని మాత్రం నిలువ ఉంచి ఆ ప్రాజెక్టు నుండి వస్తున్న వరదను 40, 821, క్యూసెక్కుల నీటిని దిగువకు మాంజీర నదిలోనికి వదిలేస్తూ ఆ ప్రాజెక్టును అప్రమత్తం చేస్తూ అధికారులు ఎప్పటికప్పుడు నీటి కొలతలు చూస్తూ అప్రమత్తమవుతున్నారు.

దాంతోపాటు ఎగువన ఉన్న పసుపు యేరు, రామాయంపేట, తూప్రాన్ ప్రాంతాలలో  వర్షాలు అధికంగా కురవడంతో అతి భారీగా వరద సుమారు 40,000 క్యూసెక్కుల వరకు భారీ వరద మాంజీర నదిలో కలుస్తుంది. దాంతోపాటు ఘనపూర్ వద్ద ఉన్న చిన్నచిన్న వాగుల నుండి, సుమారు 20 వేల క్యూసెక్కుల నీరు మంజీర నదిలో కలవడంతో దాంతోపాటు పోచారం ప్రాజెక్టు నుండి ఏడున్నర వేల క్యూసెక్కుల నీరు కలిసి మొత్తం సుమారు లక్ష ఇరవై వేల క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వరద నీరు కలవడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుతూ వాటర్ వెనక్కి కొట్టడంతో మoజీర నది పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల పంట పొలాల్లో భారీగా నీరు చేరి వరి పంట మొత్తం నీట మునిగింది. దీంతో రైతులు ఎంతో కష్టపడి పంటలు వేసుకున్న  అధికారులు నిర్లక్ష్యం వల్ల తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని రైతులంటున్నారు. 

ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు రైతులు మొర పెట్టుకున్న, అధికారులకు చెప్పామంటూ చేతులు దులుపుకుంటున్నారు. కనీసం ఎగువ నుండి వస్తున్న భారీ వరదను నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు పూర్తిగా గమనించి దిగువకు నీరును వదిలి రైతుల పంట పొలాలను, ప్రాజెక్టును కాపాడవలసిందిగా పలువు రైతులు కోరుతున్నారు. గత  నాలుగు రోజులుగా వరి పంట నీట మునగడంతో తమ పంట పొలాల మునిగిపోయే ప్రమాదం ఉందని వెంటనే నీటిని వదిలితే తమ పంట పొలాలు దక్కుతాయని రైతులంటున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రాజెక్టు ప్రయోజనాన్ని గుర్తించి నీటిని వదలాలని కోరుతున్నారు.