calender_icon.png 20 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళను చంపిన నిందితుడికి జీవిత ఖైదు

20-08-2025 01:02:40 AM

నిజామాబాద్ రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి.శ్రీనివాస్ తీర్పు

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్ ఆగస్టు 19: (విజయ క్రాంతి): ఒక వృద్ధ మహిళను రోకలి దుడ్డుతో తలపై కొట్టి హత్య చేసిన యువకుడు గుడిలింగం పండరికి జీవిత కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి తూముకుంట శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు.కోర్టు తీర్పులోని వివరాలు.

మొత్తం పదమూడు మంది సాక్ష్యుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, పదహారు ధ్రువీకరించుకున్న పత్రాలు, ఐదు వస్తు గత సాక్ష్యాలు మార్క్ చేసుకుని అధ్యయనం చేసిన అనంతరం కామారెడ్డి జిల్లా బిచ్కుందమండల కేంద్రంలోని శివాజీ నగర్ నివాసుడైన పండరి కూలిపని చేస్తూ జీవించేవాడు. జల్సాలు, కల్లుకు అలవాటు పడ్డాడు.అవసరాలకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో అతని దృష్టి దొంగతనాల వైపు మళ్ళింది.తన ఇంటికి దగ్గరగా ఒంటరిగా ఒక ఇంటిలో ఉన్న అరవై ఏళ్ల దళిత మహిళ గోనె కాశవ్వ ఉన్నది చూసి 29 సెప్టెంబర్, 2024 మధ్యాహ్నం మూడు గంటలకు ఆమె ఇంటిలోకి  వెళ్లి రోకలి దుడ్డుతో ఆమె తలపై కొట్టి హత్య చేశాడు.

అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవులకున్న బంగారు  నాగులు దొంగలించాడు.సదరు నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో నిరూపణ అయినట్లు నిర్ధారిస్తూ ముద్దాయి పండరికి హత్య నేరంకుగాను జీవితఖైదు, దొంగతనం నేరంకుగాను ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్ష, షెడ్యూల్ కులానికి చెందిన మహిళ అని తెలిసి నేరాలకు పాల్పడినందన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పై అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(2)(v) ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్ష విధించారు. శిక్షలన్ని ఏక కాలంలో అనుభవించాలని జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో వ్రాశారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటువసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించినట్లు ఎస్ సి, ఎస్ టి కోర్టు లైజన్ పోలీస్ అధికారి రాజేష్వర్ తెలిపారు.