16 August, 2026 | 1:58 AM

శతక్కొట్టిన పడిక్కల్

16-08-2026 12:50 AM
  1. రాహుల్ హాఫ్ సెంచరీ 
  2. తొలి రోజు భారత్ జోరు

శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఫుల్ జోష్‌తో ప్రారంభించింది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయంతో తొలి టెస్ట్ మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. పడిక్కల్ సెంచరీతో మెరిస్తే, రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్‌కు ఇది 600వ చారిత్రక టెస్ట్ కావడం విశేషం. బ్యాటర్ల జోరుతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ఠ స్థితికి చేరుకుంది. 

గాలె, ఆగస్టు 15 : ఈసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో భారత్ బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్లతో ముగ్గురు స్పిన్నర్లను కూడా తుది జట్టులోకి తీసుకుంది. భారత్‌కు ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్ విచిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు.

ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ ఆడిన షాట్‌ను ఆపే ప్రయత్నంలో శ్రీలంక బౌలర్ కేషార నువాన్త జైస్వాల్‌ను ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు. ఈ గందరగోళం వల్ల జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరూ నాన్-స్ట్రైకర్ ఎండ్‌చేరుకున్నారు. లంక ఆటగాళ్లు వికెట్లను పడగొట్టడంతో రీప్లేలను పరిశీలించి రాహుల్ క్రీజులో ముందుగా బ్యాట్ ఉంచినట్లు తేలడంతో జైస్వాల్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. ఈ దశలో పడిక్కల్, రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.

వీరిద్దరూ లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 150 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే 77 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర రాహుల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత కెప్టెన్ గిల్ (16) నిరాశ పరిచినా, పడిక్కల్ సెంచరీతో చెలరేగాడు. మధ్యలో వర్షం కారణంగా ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగినా, అద్భుతమైన షాట్లతో అలరించిన పడిక్కల్, 147 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

కాగా భారత స్వాతంత్య్రదినోత్సవం నాడు సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. పడిక్కల్‌కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ. మూడో టెస్ట్‌లోనూ అతను ఈ ఫీట్ సాధించాడు. సౌరవ్ గంగూలీ తర్వా త మూడో స్థానంలో టెస్ట్ సెంచరీ బాదిన భారత లెఫ్టాండర్‌గా పడిక్కల్ రికార్డ్ సా ధించాడు. 2002లో ఢిల్లీ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ 136 పరుగులతో ఈ ఫీట్ సాధించాడు.

మూడో స్థానంలో సెంచరీలు బాదిన భారత లెఫ్టార్మ్ బ్యాటర్లలో పడిక్కల్ 8వ స్థానంలో నిలిచాడు. దీంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 288 పరుగులు చేసింది. పడిక్కల్ 131 (12 ఫోర్లు, 1 సిక్సర్), పంత్ 27 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రబాత్ జయసూర్య ఒక వికెట్ తీసాడు. 

స్కోరు బోర్డు 

భారత్ తొలి ఇన్నింగ్స్ : 288/2 (పడిక్కల్ 131 బ్యాటింగ్, రాహుల్ 77, జైస్వాల్ 32, పంత్ 27 బ్యాటింగ్, ప్రబాత్ జయసూర్య 1/77)