27 March, 2026 | 6:15 AM

కూలీగా పద్మశ్రీ మొగులయ్య

04-05-2024 01:51 AM

ప్రభుత్వ హామీలు అందక..

ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పనికి..

వీడియోలు వైరల్ కావడంతో వెలుగులోకి 

వ్యక్తిగతంగా ఆదుకుంటానని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

రంగారెడ్డి, మే3 (విజయక్రాంతి): రాష్ట్రం లో అంతరించిపోయిన కిన్నెర వ్యాద్యంతో దర్శనం మొగులయ్య ఊరూరా ప్రజలను అలరిస్తూ పొట్టపోసుకున్నారు. ఆయన గానం నచ్చి సినీ పరిశ్రమ కూడా అవకాశం ఇచ్చింది. ఆయన ప్రతిభకు మెచ్చి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ అవకాశాలు, పురస్కారాలు ఆయన పొట్ట నింపలేదు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నేడు కూలీగా మారారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ప్రస్తుత ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. పొట్టకూటికి తప్పని పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి పనులకు వెళుతున్నారు.

ఇబ్రహీంపట్నంలోని తుర్కయంజాల్‌లో మండుటెండలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో ఉండగా కొందరు ఆయన వీడియోలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా వైరల్‌లయ్యాయి. ఆయన దీనస్థితిని చూసి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంటకు చెందిన మొగులయ్యకు ౯ మంది సంతానం. నలుగురు బిడ్డలు చనిపోగా ఇద్దరు కూతు ర్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. కొంతకాలంగా మొగులయ్య హైదరాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. మొగులయ్య కుమారుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మొగులయ్య ఆరోగ్యం అంతంతమాత్రమే కావడంతో ఇద్దరికి కలిపి ప్రతినెల రూ.10వేల నుంచి 15 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభు త్వం నుంచి వస్తున్న పదివేల ఫించనే వారికి ఆదరువు. అది సైతం ప్రస్తుతం రెండు నెలలకు ఒక్కసారి రావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.  

2022 లో పద్మశ్రీ పురస్కారం

మొగులయ్య కళను గుర్తించి 2022లో కేంద్రం పద్మశ్రీ అవార్డును అందజేసింది. అప్పుడు ఆయన దీనస్థితి చూసి మాజీ సీఎం కేసీఆర్ రూ.కోటితోపాటు హయత్‌నగర్‌లో 600 గజాల ఇంటి స్థలం కేటాయించారు. ఆ డబ్బులతో అవుసలికుంటలో ఓ ఇంటిని నిర్మించుకొని ఇద్దరు కూతుళ్ల పెళ్లిచేశారు. మిగతా డబ్బుతో తుర్కయంజాల్ సమీపంలో స్థలం కోనుగోలు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. అయి తే డబ్బులు సరిపోకపోవడంతో పనులను మధ్యలోనే  ఆపేశారు. ఇటీవల సీఎంగా బాధ్యతలు తీసుకొన్న రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మొగులయ్య మర్యాదపూర్వకంగా కలిసి తన సమస్యను విన్నవించారు. ఆదుకొంటామని హామి ఇచ్చి ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఫించన్‌ను రూ.25 వేలు పెంచుతానని ప్రకటించారు. ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 600 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన జీవోకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు ముందుకు కదలడం లేదు. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సీసీఎల్‌ఏ నవీన్‌మిట్టల్‌ను కూడా మొగులయ్య పలుసార్లు కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున ఏలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని, అంతేకాకుండా  ప్రభుత్వం నుంచి తమకు ఏలాంటి ఆదేశాలు రాలేదని సమాధానం ఇచ్చారు.

వ్యక్తిగతంగా ఆదుకుంటా: కేటీఆర్

మొగులయ్య రోజువారీ కూలీగా మారడం చూసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కే తారక రామారావు చలించిపోయారు. మొగులయ్య కుటుంబాన్ని ఆదుకుంటా నని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. తన కార్యాలయ సిబ్బంది వెంటనే మొగుల య్య వద్దకు వెళ్తారని కేటీఆర్ తెలిపారు.