అనంతాకాశంలో పద్మనాభుడు
తెలుగు, ఆంగ్లం భాషల్లో పాండిత్యం కలిగిన పద్మనాభరావు సుమారు నూరు గ్రంథాలకు పీఠికలు అందించారు. వీరు రచించిన గ్రంథాలు ఐఏఎస్ విద్యార్థులకు కల్పతరువులుగా భాసించాయి. జీవిత చరిత్రలను రచించిన వారిలో పద్మనాభరావు ముఖ్యులు.
ఆకాశవాణి శ్రోతలకు గాని, రచయితలకు గాని, సాహితీప్రియులకు గాని డాక్టర్ అనంత పద్మనాభరావు గురించి తెలియకుండా ఉండదు. ఆకాశవాణి అందరిదని అంటుంటారు. దేశంలోని చాలా ప్ర దేశాల్లో ఆకాశవాణిలో తన వాణిని వినిపించిన ఏకైక వ్యక్తి అనంత పద్మనాభరావు.
పదవీ విరమణ తర్వాత కూడా తన 78 వ ఏట దేశంలో ఎక్కడ సాహిత్య సభ జరిగినా, సంస్థల ఆహ్వానం మేరకు వెళ్లడం అ నంత పద్మనాభరావు ప్రత్యేకత. ఇటీవలనే తాళ్లపాక అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో మొదలయ్యాయి. పద్మనాభరావుతోపాటు నాకు ఆహ్వానం లభించడం వల్ల ఇద్దరం మే 3వ తేదీ నాటి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆకాశవాణిలో పనిచేశారు కనుక, స్వరభంగం కాకుండా, సుకుమారంగా తనదైన శైలిలో ప్రచార సాధనాల ద్వారా అన్నమయ్య సంకీర్తనల ప్రచారం ఎలా జరుగుతుందో పద్మనాభరావు వివరించారు.
నేను అన్నమయ్య సంకీర్తనల్లో ప్రతిబింబించిన సామాజిక సమరతను గురించి మాట్లాడటం జరిగింది. సభకు అధిక సంఖ్యలో ప్రే క్షకులు రాకున్నా మేం మా ధర్మాన్ని చక్కగా నిర్వహించాం. ఆ మర్నాడు కొండ మీదికి స్వామి దర్శనార్థం వెళ్లి వచ్చాం. తిరుపతిలో కలిసి ఉన్న రెండు రోజులు పద్మనాభరావుని దగ్గరగా చూశాను. వారి వ్యక్తిత్వం నిర్మలమైంది. ప్రతి మాటలో మార్దవం చోటు చేసుకున్నది.
హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న పద్మనాభరావు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. వారు తెలుగు సాహిత్యంలో ఇంచు మించుగా అన్ని ప్రక్రియల్లో రచనలు చేసి ఉండటం వల్ల అన్ని సాహిత్య సంస్థలు వారిని ఆహ్వానిస్తూ ఉంటాయి. చూడటానికి సామాన్యులుగా కనిపిస్తారు గాని, మర్యాదను ఇచ్చిపుచ్చుకోవడంలో వారికి వారే సాటి.
పద్మనాభరావు కవిగా, కథారచయితగా, నవలాకారుడిగా, సాహితీ సమీక్షకునిగా, జీవిత చరిత్రకారునిగా, అనువాదకునిగా, చివరికి పరిశోధకునిగా లబ్ధ ప్రతిష్టులు. అసామాన్య ప్రతిభా విశేషాలు కలిగినప్పటికీ, ఏ మాత్రం ఆడంబరం లేని సాధార ణమైన వ్యక్తిగా అందరితో కలిసిపోవడం పద్మనాభరావు ప్రత్యేకత.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరంలో జన్మించిన పద్మనాభరావు స్వతంత్ర ప్రవృత్తి కలిగిన విద్వాంసుడు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేసి స్వర్ణ పతకాన్ని సాధించారు. అదే యూనివర్సిటీ నుంచి కందుకూరి రుద్ర కవి మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ డిగ్రీ సంపాదించారు. పద్మనాభరావు పరిశోధన పాట వాన్ని తెలుసుకోవడానికి నన్నయ నుంచి చిన్నయసూరి వరకు గల కవుల కావ్యాలలోని ప్రకృతి వర్ణనల మీద చేసిన 300 పు టల పరిశోధన గ్రంథం సాక్ష్యంగా నిలుస్తుం ది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలలో తలమునకలవుతూనే వ్యవధానం దొరికినప్పుడల్లా 50 అవధానాలు చేశారు.
మొదట్లో లెక్చరర్‌గా పనిచేసి ఆ తర్వాత కడప, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో పనిచేశారు. 1982 మధ్యకాలంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. రెండేళ్లపాటు ఢిల్లీలోని స్టాప్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉండి, ఆ తర్వాత అనంతపురం ఆకాశవాణి కేంద్రానికి తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1995 మధ్యకాలంలో విజ యవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌గా ఉం డి, 2001లో పాలసీ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. విశేషించి 2001లో నే దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో పనిచేసి 2005లో పదవీ విరమణ చేశారు.
పదవీ విరమణ అనంతరం, పద్మనాభరావు తమ విశ్రాంత జీవితాన్ని ఇంటికే పరి మితం చేయలేదు. ఐఏఎస్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. వందకు పైగా వీరి కథలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి తొలి కథ 1972లో ‘జమీ న్ రైతు’ పత్రికలో అచ్చు కావడం విశేషం. వీరి కథలు ‘కథాకమామిషు’, కథా మందా రం’, ‘గోరింట పూచింది’, ‘కథా దర్పణం’ అనే నాలుగు సంపుటాలుగా వెలువడ్డాయి. అనువాద కళలోనూ ప్రవేశం గల పద్మనాభరావు పది గ్రంథాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. ముల్కరాజ్ ఆనంద్ ‘మార్నింగ్ ఫేస్’ తెలుగు అనువాదానికి 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది. అమితవ్ ఘోష్ రచించిన ‘షాడో లైన్’ అనువాదానికి 2000లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
తెలుగు, ఆంగ్లం భాషల్లో పాండిత్యం కలిగిన పద్మనాభరావు సుమారు నూరు గ్రం థాలకు పీఠికలు అందించారు. వీరు రచించిన గ్రంథాలు ఐఏఎస్ విద్యార్థులకు కల్ప తరువులుగా భాసించాయి. జీవిత చరిత్రలను రచించిన వారిలో పద్మనాభరావు ము ఖ్యులు. వీవీ గిరి, ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, జమలాపురం కేశవరావు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, శంకరంబాడి సుందరాచారి మొదలైన మహనీయుల మీద పద్మనాభరావు రచించిన జీవిత చరిత్రలు విశేషమైన సమాచారానికి ఆలవాలమై, రచయిత నిర్విరామ కృషిని తెలియజేస్తున్నాయి.
చతుర్గుణిత అవధానం తాను చేయకపోయినా, ఒంగోలులో జరిగిన డాక్టర్ మేడసా ని మోహన్ చతుర్గుణితావధానంలో పా ల్గొని ఒక గంట పాటు ప్రేక్షకలను దైవప్రార్థనలో నిమఘ్నులను చేసిన సందర్భం మరి చిపోలేనిది.
పద్మనాభరావుకి శబ్దార్థాల పట్ల అనురక్తి తప్ప, విత్తార్జన పట్ల కోరిక లేదు. పదవీ విరమణ చేసిన తర్వాత ఒకసారి విమానంలో వస్తుండగా తితిదే ముఖ్యకార్య నిర్వహణాధికారి శర్మ కలిశారు. వారి కోరిక మేరకు ఒక రూపాయి కూడా తీసుకోకుండా శ్రీవేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా 2005లో ఉద్యోగంలో చేరి ఐదేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 2010 వరకు దృశ్యశ్రవణ విభాగానికి, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌కు తమ సేవలను ఉదారంగా అందించారు. అన్ని చోట్ల ప్రజ్ఞావంతులుగానే కాక సౌమ్యులుగా పేరుగాంచారు.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప






