ప్రయోగాత్మకంగానే పెయిడ్ సేవలు
ప్రజలు స్వాగతిస్తేనే కొనసాగింపు
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్
గజ్వేల్ ఏప్రిల్ 28: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరించే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్ స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా చెత్త వాహనాలకు నెలకు రూ.100 చెల్లించాలన్న అంశంపై ప్రజల్లో జరుగుతున్న చర్చ పట్ల ఆమె స్పందించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా మాత్రమే మున్సిపాలిటీ చర్యలు చేపడుతోందన్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆర్ అండ్ ఆర్ కాలనీలు, ఇంతకుముందు గ్రామ పంచాయతీలుగా ఉన్నవాటిని మున్సిపల్ పరిధిలోకి కలపడం జరిగిందని, గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో పనిచేసిన 32 మంది సిబ్బంది అలాగే కొనసాగడంతో వీరి వేతనాలు, వాహనాల డీజిల్ ఖర్చులు మున్సిపాలిటీపై అదనపు భారం అవుతున్నాయన్నారు. ఆ కాలనీల నుండి ప్రస్తుతం ఎలాంటి రెవిన్యూ (ఇంటి పన్నులు) అందడం లేదని, మున్సిపాలిటీ ఆర్థిక నిర్వహణ అంశాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
ఈ నేపథ్యంలో, ట్రయల్ రన్ రూపంలో గజ్వేల్లోని మెయిన్ రోడ్లపై ఉన్న కమర్షియల్ దుకాణాల వద్ద చెత్త సేకరణ విధానంలో కొన్ని మార్పులను పరీక్షాత్మకంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించామని, ఇది కేవలం ఒక ప్రయోగాత్మక చర్య మాత్రమేనన్నారు. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ కాదన్నారు.
ఈ అంశాన్ని మున్సిపల్ సమావేశంలో అజెండాగా తీసుకుని, అన్ని కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపాలనే ఉద్దేశ్యం మున్సిపాలిటీకి లేదన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు వసూల్ చేయలేదన్న విషయం అందరూ గమనించాలన్నారు. ప్రజలకు ఎలాంటి భారం లేకుండా సేవల మెరుగుదల కోసం మాత్రమే ఈ చర్యలు చేపడుతామని, ప్రజలు సమ్మతిస్తేనే తదుపరి చర్యలు చేపడతామన్నారు. మెరుగైన సేవలు అందించడ మే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమన్నారు.






