10-05-2025 09:57:29 AM
లాహోర్: భారత్ పై పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. శనివారం తెల్లవారుజామున తమ మూడు వైమానిక స్థావరాలను భారత క్షిపణులు, డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి(Pakistan military spokesman Lieutenant General Ahmed Sharif Chaudhry) ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇస్లామాబాద్‌లో హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నూర్ ఖాన్ (చక్లాలా, రావల్పిండి), మురిద్ (చక్వాల్), రఫీకి (ఝాంగ్ జిల్లాలోని షోర్కోట్) వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తమ సైనిక స్థావరాలు, ఆస్తులపై భారత్ భారీ నష్టం కలిగించిందని పాక్ తెలిపింది. భారత్ తమ మూడు వైమానిక స్థావరాలపై దాడులు చేసిందన్నారు. కానీ వైమానిక దళానికి చెందిన అన్ని ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
భారతదేశం తన జెట్‌లతో గగనతలం నుండి ఉపరితల క్షిపణులను ప్రయోగించిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ అనేక క్షిపణులను అడ్డగించిందన్నారు. ఇది “భారత్ ఈ ప్రాంతాన్ని ప్రాణాంతక యుద్ధంలోకి నెట్టడం దుష్ట చర్య, పాకిస్తాన్ ఈ దురాక్రమణకు ప్రతిస్పందిస్తుంది. భారతదేశం మా ప్రతిస్పందన కోసం వేచి ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు అహ్మద్ షరీఫ్ చౌదరి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ప్రెస్‌ను అకస్మాత్తుగా ముగించారు.
నిమిషాల తర్వాత పాకిస్తాన్ ఎదురుదాడిని ప్రారంభించిందని భద్రతా అధికారులను ఉటంకిస్తూ ప్రభుత్వ ప్రసార సంస్థ పీటీవీ తెలిపింది. పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (Pakistan Airports Authority) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని తెల్లవారుజామున 3.15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల విమాన రాకపోకల కోసం మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇస్లామాబాద్, లాహోర్ లో సహా ఇతర పెద్ద నగరాల్లో పేలుళ్లు శబ్దాలు వినిపించాయని పాక్ తెలిపింది. భారత్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని పాకిస్థాన్ ఆరోపించింది. సరిహద్దు దాటి మా ప్రాంతాల్లో భారత్ డ్రోన్లు దాడులు చేసిందని తెలిపింది. నీలం లోయ, సియాల్ కోట్ల లో భారత్ దాడి చేసిందని పాక్ అంటుంది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా బుధవారం భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (Pakistan Occupied Kashmir)లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు నిర్వహించిన తర్వాత రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి.