10-05-2025 02:30:29 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): చేపల కోసం చెరువులో నీటిని మత్స్యకారులు ఖాళీ చేస్తున్న ఘటనలు మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల శనివారం చోటుచేసుకున్నాయి. కేసముద్రం మండలం(Kesamudram Mandal) తాళ్లపూస పల్లి, ఇనుగుర్తి మండల కేంద్రంలో కుంటలు, చెరువుల్లో నీటిని మత్స్యకారులు తూము ద్వారా దిగువకు వృధాగా వదిలేస్తున్నారు. దీనితో వేసవికాలంలో పశుసంపదకు తాగునీటి ఎద్దడి తలెత్తడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది తలెత్తుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇనుగుర్తి చెరువులో నీటిని దిగువకు తూము వదిలి పెట్టడంతో కొందరు గమనించి వెంటనే రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా తహసిల్దార్ రవీందర్ స్పందించి వెంటనే గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా మట్టిని తెప్పించి తూము వద్ద మట్టి ని పోయించడంతో నీటి విడుదల నిలిచిపోయింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండేందుకని ప్రభుత్వం ఇటీవల ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కాలువ పరివాహక ప్రాంతంలోని చెరువులు కుంటలను నింపింది. అయితే కొందరు మత్స్యకారులు ఇవేవీ పట్టించుకోకుండా కేవలం చేపలు పట్టుకోవడానికి నీటిని వదిలిపెట్టడం సరైనది కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో నీటిని వృధాగా దిగువకు వదిలిపెట్టకుండా రెవిన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నీళ్లు వదలడానికి వీల్లేదు
యాసంగి పంటల సాగు దాదాపు పూర్తయింది. చెరువులు, కుంటల్లో నీటిని దిగువకు విడుదల చేయడానికి వీల్లేదు. చేపలు పట్టుకునే మత్స్యకారులు వలవేసి చేపలు పట్టుకోవాలి. అంతేతప్ప చెరువులు, కుంటల్లో నీటిని కిందకు విడుదల చేయకూడదు. నీటిని వృధాగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి ఘటనలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: రవీందర్, తహసిల్దార్, ఇనుగుర్తి