10-05-2025 01:50:56 PM
సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
మహబూబాబాద్, (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారుల లాభాల కోసమే లేబర్ కోడ్(Labour Codes)లను తెచ్చి కార్మికులను బలిజేస్తున్నదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో జగన్నాధం భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్టుబడి దారులు, కార్పొరేట్ల ప్రయోజనాలు, లాభాల కోసం కార్మికులను బానిసలుగా తయారు చేసేందుకే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందన్నారు.
ఈ ప్రమాదకరమైన లేబర్ కోడ్ లను రద్దు చేసేలా బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మె జయప్రదానికై జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. లేబర్ కోడ్ ల రద్దు, కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత, ధరల తగ్గింపుకై జరుగుతున్న ఈ దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలోని కార్మికులు ఐక్యంగా కదిలి, పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు, జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, కుమ్మరికుంట్ల నాగన్న, ధారా స్నేహబిందు, తోట శ్రీనివాస్, వాసం దుర్గారావు, కాంపెళ్లి శ్రీనివాస్, సుధాకర్, యాకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.