10-05-2025 03:31:59 PM
న్యూఢిల్లీ: భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో హతమైన ఐదుగురు ఉగ్రవాదుల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఈ జాబితాలో మౌలానా మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్‌తొయిబా ఉగ్రవాదాలను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ లో ముదస్సర్ ఖదాయిన్ ఖాస్(లష్కరే తొయిబా) హతమయ్యాడు. పాకిస్థాన్ ఆర్మీ లాంఛనాలతో ముదస్సర్ అంత్యక్రియలు నిర్వహించారు. ముదస్సుర్ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్, పాక్ లోని పంజాబ్ సీఎం హాజరయ్యారు. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ ఇద్దరు బావామరుదులు హతమయ్యారు. మసూద్ అజార్ పెద్ద బావమరిది హఫీజ్ మహమ్మద్ జమీల్, మరో బావమరిది మహ్మద్ యూసఫ్ అజార్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ సిందూర్.. మెరుపుదాడుల్లో ముదాసర్ ఖదియాన్ ఖాస్, హఫీజ్ మహ్మద్ జమీల్, మహ్మద్ యూసఫ్ అజార్, ఖలీద్ అబు అకాసా, మహ్మద్ హసన్ ఖాన్ హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలకు ఉటంకిస్తూ ఇంగ్లీస్ మీడియా కథనాలు వెల్లడించాయి.
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడారు. భారత్- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న వివాదంలో "తప్పు లెక్కలను నివారించడానికి" ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించాలని మార్కో రూబియో శనివారం తెల్లవారుజామున ఇరు దేశాలను కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. రూబియోతో సంభాషణ తర్వాత, భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని జైశంకర్ తెలియజేశారు. శుక్రవారం రాత్రి తాజా దాడి తర్వాత, కేంద్రం ఈరోజు ప్రెస్ మీటింగ్ నిర్వహించింది. భారత్ బాధ్యతాయుతంగా ప్రతీకారం తీర్చుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలియజేశారు. పాకిస్తాన్ ప్రారంభించిన తాజా దాడుల నేపథ్యంలో, శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉండటంతో వరుసగా రెండవ రోజు బలవంతపు విద్యుత్ సరఫరా నిలిపివేత జమ్మూ, జైసల్మేర్, ఫిరోజ్‌పూర్‌లను అంధకారంలోకి నెట్టింది. జమ్మూ, శ్రీనగర్ అనేక ఇతర ప్రాంతాల నివాసితులు పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నట్లు నివేదించారు. ఫిరోజ్‌పూర్‌లో, శుక్రవారం రాత్రి ఒక నివాస ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్ దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.