10-05-2025 01:46:16 PM
కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు
వాలంటీర్ల కు ప్రత్యేక శిక్షణ
హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జడ్జ్ సుజోయ్ పాల్
కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించేందుకు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జడ్జ్ సుజోయ్ పాల్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ డివి శ్రీనివాసరావు, పి ఓ కుష్బూ గుప్తా, న్యాయమూర్తులు యువ రాజా, అనంతలక్ష్మి, అజయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ తో కలిసి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ప్రారంభించి సెంటర్ ద్వారా అందుతున్న సేవలను వివరించారు. కార్యక్రమానికి ముందు ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత మాతృభాష తెలుగు లో మాట్లాడాలని ఉన్నప్పటికీ నేను మాట్లాడలేనని ఈ ప్రాంత ప్రజలకు అందరికీ హిందీపై అవగాహన ఉందని భావిస్తూ హిందీలో ప్రసంగించారు.
మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ హనుమకొండలో ఈ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని మారుమూల జిల్లా అయిన ఆసిఫాబాద్ లో ఈ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 2023లో కమ్యూనిటీ మీడియేషన్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. ప్రస్తుత కాలంలో వివాహ బంధాల మధ్య మనస్పర్ధం ఏర్పడి విచ్ఛిన్నం అవుతున్నాయని వాటిని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. చిన్నచిన్న వివాదాలతో నెలకొన్న సమస్యలను ఈ సెంటర్ ద్వారా పరిష్కారం చేపట్టడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ మిడియేషన్ సెంటర్ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు పలు కమ్యూనిటీల సభ్యులు ముందుకు రావాలని వారికి మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.