10-05-2025 01:43:16 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో వరి సాగు చేసిన రైతుల ధాన్యాన్ని ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ పేర్కొన్నారు. శనివారం హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. సెలవు రోజున ఇంటికి పరిమితం కాకుండా రైతుల బాట పట్టి కొనుగోలు కేంద్రాలను తిరిగి పరిస్థితిని సమీక్షించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎక్కువ ఉన్న కేంద్రాలకు లారీలను తెప్పించి లోడింగ్ చేయించారు. అవసరమున్న కేంద్రానికి ఒకే రోజు నాలుగు నుంచి ఐదు లారీలను తెప్పించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తాం...
రైతుల పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసే మిల్లులకు తరలించే బాధ్యత తమదేనని అందం కలెక్టర్ మోతిలాల్ అన్నారు. రైతులు అధైర్య పడవద్దని, కొనుగోలు కేంద్రాల వారిగా ఎన్ని గోల సంచులు అవసరం, ఎన్ని బస్తాలు తూకం వేశారు, వాటిని తరలించేందుకు ఎన్ని లారీలు అవసరమో ప్రతిరోజు సాయంత్రం వివరాలు తీసుకొని వాహనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. జిల్లాలో మిల్లులు తక్కువ ఉండడంతో మంచిర్యాల జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలోని మిల్లులకు ధాన్యాన్ని పంపిస్తున్నామని, ఏ మిల్లులో లారీలు తక్కువ ఉంటే ఆ మిల్లుకు ట్యాగింగ్ ఇచ్చి పంపిస్తున్నామన్నారు. రైతుల డబ్బులు సైతం అంతే వేగంగా పడేలా చూస్తున్నామన్నారు.
లారీల సంఖ్యను పెంచాం...
జిల్లాలో ఏర్పాటు చేసిన 323 కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు మూడు క్లస్టర్లుగా వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. లారీలు క్లస్టర్ల వారిగా కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అవసరమైతే లారీల సంఖ్యను పెంచుతామన్నారు. లారీలు త్వరగా అన్లోడింగ్ కావాలంటే నాణ్యమైన ధాన్యాన్ని తూకం వేసి పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యానికి సంబంధించి కొర్రీలు లేకుండా కొనుగోలు కేంద్రాల్లోనే క్లీనింగ్ చేసి పంపాలని నిర్వాహకులకు సూచించారు.