05-05-2025 09:02:08 PM
బీఆర్ఎస్ నేత డాక్టర్ రాజా రమేష్..
మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద ప్రాజెక్టైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్(BRS Party Chennur Constituency In-charge Raja Ramesh) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలిపేందుకు మాజీమంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రౌండ్ సమావేశంలో సమావేశానికి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజల్లో కేసీఆర్ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయాని విమర్శించారు. కేసిఆర్ కు తెలంగాణ మీద అవగాహన ఉండి, ప్రజలకు ఏమి కావాలో తెలిసిన వ్యక్తిగా, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించిన జననేత, మహానాయకుడు కేసిఆర్ అని కొనియాడారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసుతో 93 వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అనడం నిజంగా తెలివికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, సిడబ్ల్యూసి, ఎన్డిఎస్ఏ లు ప్రాజెక్టు కట్టినప్పటి నుండి ఇప్పటివరకు నిద్రపోతున్నాయా అని ప్రశ్నించారు. నేడు కాంగ్రెస్, బిజెపి నాయకుల కుట్రల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.