05-05-2025 08:54:09 PM
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ...
మంచిర్యాల (విజయక్రాంతి): తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్(TASK) ద్వారా ఉపాధి సామర్థ్యాన్ని పెంచే నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna) అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టాస్క్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు మాట్లాడుతూ... 30 రోజుల పాటు అర్హత గల యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అందించి వారి ఉపాధి అవకాశాలను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు.
శిక్షణ మొదటి విడతలో ఎంపికైన 40 మంది నిరుద్యోగ యువతకు శిక్షణలో భాగంగా సి, సి++, జావా, పైథాన్, ఆప్టిట్యూడ్ రీజనింగ్(ఎ&ఆర్), ఇంటర్వ్యూ నైపుణ్యాలలో శిక్షణ అందించడం జరుగుతుందని, అభ్యర్థుల వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలని, డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ పూర్తి చేసి ఉండాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమం అనంతరం నైపుణ్యత గల అభ్యర్థులకు ఉపాధి అవకాశానికి సహాయం అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, టాస్క్ ప్రతినిధి సాయికృష్ణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.