05-05-2025 08:31:36 PM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు..
హనుమకొండ (విజయక్రాంతి): భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని వర్షన్నపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశారు. సోమవారం మండలంలోని బండవుతాపురం, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన రెవిన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(District Collector Satya Sharada)తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju) పాల్గొన్నారు. భూ భారతి రెవెన్యు సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలను పరిశీలించి, రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు ఎమ్మెల్యే నాగరాజు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేకమంది పేద రైతులు ఇబ్బందులకు గురయ్యారని, వేల ఎకరాల భూములు గల్లంతయ్యాయని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకువచ్చిందన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టా జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం సీనియర్ అధికారులతో అన్ని రాష్ట్రాల్లో విచారణ చేసి సులువైన పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.
భూములు కొన్నా, అమ్మినా లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా హద్దులతో మ్యాపు తయారు చేసి పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు చేస్తారని తద్వారా భూమి గుర్తింపుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. తహసీల్దార్ ద్వారా ఏదేని పొరపాటు జరిగితే ఆర్డిఓ, ఆర్డిఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి భూ ట్రిబ్యునల్ నకు వెళ్ళడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సహాయ సేవలు అందించడానికి అవకాశం కల్పించారని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రికార్డుల నవీకరణలను చేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల జూన్ 2 న పట్టా పాస్ పుస్తకాలను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే సభ ముఖంగా తెలిపారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా నా డయల్ యువర్ ఎమ్మెల్యే నెంబర్ 8096107107 సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయసాగర్, మార్కెట్ ఛైర్మన్ వెంకటయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామ పార్టీల అధ్యక్షుడు దశరథం, రెవిన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరలు పాల్గొన్నారు.