23-04-2025 01:37:26 AM
ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రజాస్వామ్య దేశం లో పార్లమెంటే సుప్రీం అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పునరుద్ఘాటించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం లో మంగళవారం ఆయన ఓ సదస్సు కు ముఖ్యఅతిథిగా విచ్చేసి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో న్యాయవ్యవస్థ హద్దులు మీరి వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులకే రాజ్యాంగ రూపురేఖ లు మార్చే అధికారం ఉంటుందని, రాజ్యాంగంపై అంతిమ హక్కులు ప్రజాప్రతినిధులవేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రజాప్రతినిధుల కంటే ఇక పైస్థాయి ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనమన్నారు. కానీ.. ఇందిరాగాంధీ హయాం లో ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లిందని, నాడు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ప్రస్తావించారు.
రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్లు పంపించిన బిల్లులకు నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉప రాష్ట్రపతి తప్పుపడుతూ.. రాష్ట్రపతికి గడువు నిర్దేశించే లా న్యాయవ్యవస్థ వ్యవహరించకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజ్యాంగమే సుప్రీం: కపిల్ సిబాల్
ఢిల్లీ వర్సిటీ వేదికగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కపిల్ సిబాల్ కౌంట ర్ ఇచ్చారు. అసలు పార్లమెంట్ అత్యున్నతమైనదా? కార్యనిర్వాహక వ్యవ స్థ సుప్రీమా? అన్నది ప్రశ్నే కాదని, రాజ్యాం గం మాత్రమే సుప్రీం అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.