calender_icon.png 28 August, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాధికారంలో భాగస్వామ్యం పెరగాలి

13-06-2024 12:05:00 AM

స్వాతంత్య్రానంతరం నేటివరకూ అన్ని రంగాల్లో వలెనే రాజకీయ రంగంలోనూ ముదిరాజ్‌లకు తీరని అన్యాయం జరుగతోంది. రాష్ట్రంలోని బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన కులంగా గుర్తింపు పొందిన ముదిరాజ్‌లు రాష్ట్ర నలుచెరుగులా విస్తరించి వున్నారు. వ్యవసాయ, మత్స్యకార, పారిశ్రామిక రంగాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న వీరిని రాజకీయ పార్టీలు కావాలనే నిర్లక్యం చేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్‌లు విద్యా, ఉద్యోగ రంగాల్లోనూ వూర్తిగా వెనుకబడి పోతున్నారు. పౌరుషా నికి, నీతి నిజాయితీలకు మారు పేరైన ముదిరాజ్‌లకు దేశ రక్షణ రంగంలో సైనికులుగా ముందు నిలిచిన చరిత్ర వుంది.

పూర్వం ముదిరాజ్‌లను గ్రామ రక్షకులుగా, సైనికులుగా వినియోగించే వారని చరిత్రకారులు పేర్కొ న్నారు. అంతటి ధైర్య సాహసాలు, నిబద్ధత, త్యాగనిరతిగల ముదిరాజ్ జాతి శక్తి సామర్థ్యాలను నేటి పాలకులు కావాలనే విస్మరిస్తున్నారు. రాజకీయ రంగంలోనూ ముదిరాజ్‌ల భాగస్వామ్యం నామమాత్రంగానే ఉంది. అత్యధిక సంఖ్యగల ముదిరాజ్ లను నేడు రాజకీయ పార్టీలు జెండాలు మోయడానికే పరిమితం చేస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి ఒకటో అరో సీట్లు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. ముదిరాజ్‌ల రాజకీయ పరిధి విస్తరించకుండా కావాలనే అయా పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి.

స్వాతంత్య్రానంతరం నేటి వరకూ నాలుగు జిల్లాల నుండే ముదిరాజులకు శాసన సభ్యులుగా ప్రాతినిధ్యం లభించిందంటే పాలన పార్టీల రాజనీతిని మనం అర్థం చేసుకోవచ్చు. నాయకత్వ లక్షణా లు, అంకితభావం, శానససభ్యులు కాగలిగిన సత్తా వున్న నేతలు ముదిరాజ్‌లలో అనేకమంది వున్నప్పటికీ రాజకీయ పార్టీలు కుంటిసాకులు చూపుతూ వారికి ఆ అవకాశం దక్కనీయడం లేదు. నమ్మిన పార్టీల కోసం అంకితభావంతో పనిచేస్తూ వాటికే అధికారం కట్టబెడుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ముదిరాజ్‌లను గుర్తించేందుకు ముందు కు రావడం లేదు.

రాజకీయ పార్టీలు కావాలనే ముదిరాజ్‌లకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. అగ్రవర్ణాల నాయకత్వంలో నడుస్తోన్న ఆయా రాజకీయ పార్టీలు ఆయా వర్గాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ముదిరాజ్‌లను, ఇతర బీసీ కులాలను కావాలనే విస్మరిస్తున్నాయనేది నగ్నసత్యం. సర్పంచ్ ఎన్నిక మొదలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ, ఛైర్మన్, ఎమ్మెల్యే, ఎంఎల్సీ స్థాయి వరకు గెలుపొంది ముదిరాజ్‌లు తమ సత్తా చాటుకున్నప్పటికీ జనాభా ప్రాతిపదికన వారికి ఎంఎల్ ఎ, ఎంపీ సీట్లు కేటాయించే విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఇది పెత్తందారుల కుట్ర. అనాదిగా జరుగుతున్న ఈ అన్యాయాన్ని అందులో భాగంగానే చూడాలి.

ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు అతి కీలకమైన రాజ్యసభ స్థానాలను గానీ, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను గానీ ముదిరాజ్‌లకు కేటయించలేదు. అయా పార్టీల దుర్నీతికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తర్వాత నేటివరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ అన్ని ఎన్నికల్లోనూ కలిసి అసెంబ్లీలో కేవలం 17 మంది ముదిరాజ్‌లు మాత్ర మే శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారు. ముదిరాజ్‌లను రాజకీయ పార్టీలు ఏ విధం గా దగా చేస్తున్నాయనే దానికి పై సంఖ్యా వివరాలే ప్రబల తార్కాణం. నేటి వరకు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ముదిరాజ్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మొత్తం 17 మంది ముదిరాజ్ నాయకులు శాసనభ్యులుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టిన ఘనత ముదిరాజ్ కులంలో కె. రంగదాస్, డా॥ ఎం.ఎస్ లక్ష్మీనర్సయ్య, శ్రీమతి కేవల్ అనందాదేవిలకు దక్కింది. 1962లో రంగదాస్ గారు మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. మాజీ ఎమ్మేల్యే కేవల్ కిషన్ (సిపిఐ) సతీమణి కేవల్ ఆనందాదేవి 1962లో మెదక్ నియోజక వర్గం నుండి సిపిఐ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

డా॥ ఎం. ఎస్. లక్ష్మీనర్సయ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజక వర్గం నుండి కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో పలు శాఖలను నిర్వహించారు. ఎం. మాణిక్‌రావు 1969లో రంగారెడ్డి జిల్లా తాండూర్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978, 1983 ఎన్నికల్లో కూడా మాణిక్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. పీవీ నర్సింహారావు, టి. అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాలలో మాణిక్ రావు వివిధ శాఖలను సమర్థ వంతంగా నిర్వహించి ప్రజా నాయకునిగా నియోజక వర్గంలో పేరు సంపాదించుకున్నారు.

సి.జగన్నాథరావు ముదిరాజ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందగలిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం నుండి శాసనసభలో అడుగిడిన జగన్నాథరావు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 1972, 80, 82 సంవత్సరాలలో అయన నర్సాపూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జయభేరి మోగించారు. విద్యార్థి దశనుండే ఉద్య మ పథాన నడిచిన సీజేఆర్ రాజకీయాల్లో ప్రవేశించి తన సత్తా చాటారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ నిర్వహించారు. 1982లో భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. భారీ పరిశ్రమలు, హూంశాఖ మంత్రిగా కూడా సీజేఆర్ పని చేశారు. 1974లో తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ బోర్డు అధ్యక్షునిగా కూడా జగన్నాథరావు పని చేసి ప్రజా మన్ననలు పొందగలిగారు. డిప్యూ టీ స్పీకర్‌గా సీజేఆర్ పనిచేశారు.


 పల్లెబోయిన అశోక్,

ప్రధాన కార్యదర్శి, 

తెలంగాణ ముదిరాజ్ మహాసభ