13-06-2024 12:05:00 AM
‘సర్కార్ బడి విలువ నాకు తెలుసు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ‘తాను తనతోపాటు చాలామంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివామని, వాటి అభ్యున్నతికి కృషి చేస్తానని’ ప్రకటించడం ఆహ్వానించదగ్గ, అభినందించదగ్గ అంశం. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ‘ప్రతి ఊర్లో బడి ఉండాల్సిందే. ఏకోపాధ్యాయ పాఠశాలలను కొనసాగిస్తాం’, విద్య మీద పెట్టుబడి భవిష్యత్ ‘సమాజానికి లాభం’ అని ప్రకటించడం ఆలోచింపచేసేదిగా ఉంది. ముఖ్యమంత్రి స్పందన ఓవైపు బడిబాటలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు ఇంకొకవైపు విద్యావ్యవస్థను సవాల్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
నూతన ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ప్రయాణాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పోలుస్తూ, ‘ఉచితంగా పాసులు ఇస్తే బస్సులెక్కే జనం ఉచితంగా చదువు చెప్పే పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్చక పోవడానికి బస్సు డ్రైవర్ మీద ఉన్న నమ్మకం టీచర్ల మీద లేకేనా?’ అన్న ఓ వాట్సాప్ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతున్నది. ఇది ఒక రకంగా ప్రభుత్వ విద్యను, సర్కార్ వైఖరిని టీచర్ల స్థితిగతుల్ని అవహేళన చేస్తున్నట్లు ఉన్నది.
ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఒక చిరు అవకాశాన్ని పాఠశాల విద్యావ్యవస్థతో పోల్చడం దారుణం. ఇది కేవలం టీచర్ల మీద నమ్మకం లేని అంశంగా ప్రచారంలో పెట్టడం దుర్మార్గం. అసలు విద్య అందరికీ సమానంగా ప్రభుత్వమే అందించాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూళ్లు లక్షల రూపాయ ల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు విద్యా వ్యవస్థలోని స్కూళ్లకు, మధ్యాహ్నపు మెతుకులతో కడుపు నింపు కునే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు మధ్య అంతరాలను తొలగించుకోవలసి ఉంది.
‘కొఠారి కమిషన్’ నివేదికలో చెప్పినట్లు ‘పేదోడికైనా పెద్దోడి బిడ్డకైనా ఒకే రకం బడి. ఒకే రకం చదువు అందాలి’ అన్న ‘కామన్ స్కూల్’ అంశం కలగానే ఉంటున్నది. డబ్బున్న వాళ్ళకి ఓ రకమైన విద్య, డబ్బు లేని పేదలకు ప్రభుత్వ విద్య కొనసాగే విధానంలో మార్పు రావాలి. ఇందుకు ప్రభుత్వ విద్యా రంగాన్ని సంస్కరించవలసి వుంది. సీఎం రేవంత్ రెడ్డి తమ సర్కారుకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి సూచనలు అయినా స్వీకరిస్తామని’ ప్రకటించడం ఆనందదాయకం. అందుకు ఆయన లాంటి వాళ్ళు చదివిన ప్రభుత్వ పాఠశాలల లోపల ఇవాళ ఏఐఎస్ అధికారి పిల్లలుగాని, కనీసం టీచర్ల పిల్లలు కానీ చదవలేని దుస్థితి ఎందుకు కొనసాగుతున్నదో ఆలోచించవలసి ఉన్నది.
-ప్రభాకర్ కస్తూరి, సెల్: 9440970454