calender_icon.png 3 February, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మున్సిపల్’ సమరం..

03-02-2026 12:28:26 AM

చైర్మన్ పీఠంపై కన్నేసిన పార్టీలు..

సమస్యల సుడిగుండంలో ఓటరు!

మొయినాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మొయినాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 26 వార్డుల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి చైర్మన్ స్థానం ఎస్సీ (జనరల్) కు రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారం పతాక స్థాయికి చేరడంతో అభ్యర్థులు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు శ్రమిస్తున్నారు.

రిజర్వేషన్ల దెబ్బ.. ‘రిమోట్’ పాలిటిక్స్!

చైర్మన్ పీఠం ఎస్సీ (జనరల్)కు కేటాయించడంతో, గతంలో ఆశలు పెట్టుకున్న పలువురు అగ్రనేతలు షాక్కు గురయ్యారు. దీంతో వారు ప్రత్యక్షంగా కాకుండా, తమ నమ్మకస్థులను లేదా అనుచరులను బరిలోకి దింపి ‘రిమోట్ కంట్రోల్‘ పాలిటిక్స్కు తెరలేపారు. పార్టీల కండువాలు మార్చే ‘జంపింగ్’ రాజకీయాలు కూడా క్యాడర్లో అయోమయం సృష్టిస్తున్నాయి.

ఎన్నికల్లో ప్రధానంగా 111 జీవో & ఎల్‌ఆర్‌ఎస్ (LRS) చిక్కులు అభ్యర్థులను ఇరు క్కున పెట్టనున్నాయి. గత కొంతకాలంగా ఎన్నికల హామీల నీటి మూటలు గాని మిగిలిపోయాయి. మొయినాబాద్ ప్రాంతంలో అతిపెద్ద సమస్య 111 జీవో. దీనివల్ల భూముల క్రయవిక్రయాలు, నిర్మాణాలపై ఆంక్షలు ఉండటం సామాన్య ఓటర్లలో అసంతృప్తిని కలిగిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణలో జరుగుతున్న ఆలస్యం మధ్యతరగతి వర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ప్రభుత్వం ఇంటింటికీ నీరు ఇస్తామని చెప్తున్నా, పట్టణంలోని పలు వార్డులకు నీరు అందడం లేదు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ట్యాంకర్ల కోసం పడుతున్న ఇబ్బందులు ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

డ్రైనేజీ & పారిశుధ్యం కుడా అస్తవ్యస్తంగా మారాయి.వర్షాకాలం వస్తే వీధులు చెరువులుగా మారడం, మురుగు కాల్వల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ‘వార్డులను పట్టించుకునేవారికే ఓటు‘ అనే నినాదం వినిపిస్తోంది. పట్టణీకరణ వేగంగా జరుగుతున్నా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం ప్రధాన లోటుగా కనిపిస్తోంది.

త్రిముఖ పోరు.. ఎవరి ఎత్తుగడ వారిదే!

పార్టీల వారిగా ప్రధాన ఎత్తుగడలు, నినాదాలను పరిశీలించగా అధికార పార్టీ కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ పథకాలు (ఆరు గ్యారంటీలు) తమను గెలిపిస్తాయని ధీమా గా ఉండగా, బీఆర్‌ఎస్ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల కల్పనను గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతోంది.బీజేపీ అధికార పక్షాల వైఫల్యాలను ఎండగడుతూ, ’మార్పు’ నినాదంతో పట్టణ సమస్యలపై ఫోకస్ పెట్టింది. మొయినాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు (32,821) అందులో పురుషులు (16,419), మహిళలు (16,402)  మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో సమానంగా ఉండటంతో, అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మహిళా సంఘాలతో భేటీ అవుతున్నారు. ఓటరు నాడి ఎటువైపు ఉందో తెలియక అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్లో మొయినాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, అభివృద్ధిని చూసి ఓటేస్తారా లేక సమస్యల వేదికగా తీర్పునిస్తారా అన్నది వేచి చూడాలి!