13 May, 2026 | 2:14 AM

ఎన్నికలపై మీనమేషాలు

13-05-2026 01:36 AM

అధికార పార్టీకి ఓటమి భయమా.. 

జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు ముగిసి మూడు నెలలు

  1. ఈ లోపు మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ విభజన
  2. డివిజన్ల సంఖ్య 150 నుంచి 300కు పెంపు
  3. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం
  4. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీదే ఆధిక్యత
  5. అయినప్పటికీ.. గ్రేటర్ ఎన్నికలపై కుదరని గురి
  6. ఓడిపోతామనే భయంతోనే కాలయాపనంటూ ప్రతిపక్షాల విమర్శలు
  7. ముంబైలో తొమ్మిదేళ్ల పాటు సంస్కరణలు.. తాజాగా బల్దియా ఎన్నికలు
  8. అదే తరహా విధానం అనుసరిస్తున్నారని ఆరోపణలు

హైదరాబాద్, మే ౧౨ (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం పదవీకాలం ముగిసి మూడు నెలలు గడిచిపోయాయి. ఫిబ్రవరి రెండో వారంతోనే బల్దియా కౌన్సిల్ గడువు తీరిపోయింది. ఈలోపు జీహెచ్‌ఎంసీని రాష్ట్రప్రభుత్వం పరిపాలన సౌల భ్యం కోసం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎం సీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా విభజించింది.

మూడు కార్పొరేషన్లకూ కమిషనర్లను సైతం నియ మించింది. సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు విడిపోయినప్పటికీ, మొత్తంగా చూస్తే ఆ మూడు జీహెచ్‌ఎంసీలో భాగమే. గతంలో ఉన్న 150 డివిజన్లను, సర్కార్ ఏకంగా 300కు పెంచింది. వాటిని నిష్పత్తి విధానంలో మూడు కార్పొరేషన్లకు పంచింది. రాష్ట్ర జనాభాలో ౨౫% జనాభా ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలోనే ఉంటుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం ఆదాయం ఇక్కడి నుంచే వస్తుంది.

ఇంత ప్రతిష్ఠాత్మకమైన చోట్ల బల్దియా ఎన్నికలు ఆలస్యం కావడం విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే ప్రతికూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదా? లేక ఏదైనా ప్రత్యేక వ్యూహంతోనే తాత్సారం చేస్తోందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తు తున్నాయి. ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడంతో ప్రస్తు తం డివిజన్లలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. వారు సామాన్యుల సమస్యలను, అభివృద్ధి పనులను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినప్పటికీ, రాష్ట్రప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. మూడు కార్పొరేషన్ల విస్తీర్ణం ప్రస్తుతం 2,053 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. ఇంత భారీ విస్తీర్ణం ఉన్న నగరంలో ప్రజలు ఎన్నుకున్న పాలకులు (కార్పొరేటర్లు) లేకుండా అభివృద్ధి సాధ్యం కా దని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోడ్ల మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి పనులు పాలకుల పర్యవేక్షణ లేక గాడితప్పాయని చెబుతున్నారు.   

మూడు ప్రధాన పార్టీల బలాబలాలు..

జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌కు తిరుగు లేని బలంగా ఉన్నదనేది అందరూ ఒప్పుకునేదే. అందుకు ఇక్కడ ఎమ్మెల్యేల సంఖ్యాబలమే అందుకు నిదర్శనం. అర్బన్ ఓటర్ల విషయానికి వస్తే, బీజేపీ వైపే అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి నుంచీ అర్బన్ ఓటర్లలో బీజేపీకి పట్టు ఉండటం, కోర్ అర్బన్ ఏరియాల్లో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు.

ఎంపీల విషయానికొస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే అత్యధిక స్థానాలు దక్కాయి.

అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించడం లేదనే ప్రశ్న తలెత్తుతున్నది. మూడు పార్టీలకు సమానమైన బలం ఉన్నప్పుడు, సాధారణంగా అధికార పార్టీకి మరింత అనుకూలం ఉంటుంది కనుక.. త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే, సానుకూల ఫలితాలే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డివిజన్ల విభజన ఇలా..

ప్రస్తుతం నగరంలో ప్రత్యేక అధికారుల పాలనలోనే సాగుతున్నది. స్థానిక సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటేనే క్షేత్రస్థా యిలో సమస్యలు పరిష్కారం అవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎమ్మెల్యేల సంఖ్య ౨౪ నుంచి 27 మందికి పెరిగే అవకా శం ఉంది.

అయినప్పటికీ, కార్పొరేటర్లు లేకపోవడంతో పాలన, అభివృద్ధి పనులపై ప్రతికూల ప్రభావం పడతున్నది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్‌తో 243 డివిజన్లయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో మరో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. అలా డివిజన్ల సంఖ్య 300కి పెరిగింది.

బీఎంసీ తరహా ప్లాన్ అమలు చేస్తారా?

ముంబైలో గతంలో అమలు చేసిన ఎన్నికల వ్యూహా న్ని హైదరాబాద్‌లోనూ అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్నది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో 2017 తర్వాత, ఇటీవల బల్దియా ఎన్నికలు జరిగాయి. సుదీర్ఘకాలం తర్వాత, తాజాగా బల్దియా కౌన్సిల్ కొలువదీరింది. దీంతో ఏళ్లపాటు అక్కడ ప్రత్యేక అధికారుల పాలన సాగింది. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు డివిజన్ల విభజన, జనాభా సమతుల్యత వంటి సంస్కరణలు చేపట్టాయి.

దీనివల్ల రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ రాజకీయపరమైన ప్రయోజనాలు పొందా యి. ఇప్పుడు హైదరాబాద్ విషయంలోనూ కాంగ్రెస్ సర్కారు అదే మార్గంలో వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. డివిజన్ల సంఖ్య పెంచడం, ఇతర సంస్కరణలు చేపట్టడ చూస్తుంటే, అది బీఎంసీ మాడల్‌లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆలస్యమైతే మొదటికే మోసం..

ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడం  పరిణమించింది. ప్రత్యేకాధికారులు సమస్యలను సమర్థంగా పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా కొం దరు నాయకులు నగరవాసుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా మేల్కొని ఎన్నికలను త్వరగా నిర్వహించి, పాలనను పట్టాలెక్కించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా నష్టపోయే ప్రమా దం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నగరవాసుల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరుకోకముందే, బల్దియా ఎన్నికల దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.

వ్యూహాత్మక ఆలస్యం!

వాస్తవానికి నగరవాసులు తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదిస్తుంటా రు. అసలు.. ప్రజాప్రతినిధులే లేకపోతే, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి.. ఏ అధికారిని సంప్రదించాలి.. తమ సమస్యలకు ఎలా పరిష్కారం లభిస్తుందని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిర్వ హణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయడం వెనుక రాజకీయ లెక్క లు ఉన్నట్లు కనిపిస్తున్నది.

డివిజన్ల విభజన, కొత్త ప్రాంతాల కూర్పు వంటి అంశాలను సాకుగా చూపి కాలయాపన చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటమి భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తోందని మండిపడుతున్నాయి. డివిజన్లు పెంచడం, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి కొత్తగా కొన్ని ప్రాంతాలను చేర్చడం, బల్దియాను మూడు కార్పొరేషన్లుగా విభజించడమంతా వ్యూహా త్మక ఆలస్యమేనని ఘంటాపథంగా చెబుతున్నాయి.