ఎన్నికల్లో గెలిపిస్తే పర్వతగిరిని దత్తత తీసుకుంటా
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య
వరంగల్, మే 2(విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పర్వతగిరి మండలాన్ని దత్తత తీసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హామీ ఇచ్చారు. గురువారం పర్వతగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ స్థాయి సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పర్వతగిరి గ్రామ బిడ్డనైన తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పర్వతగిరిలోనే పుట్టి పెరిగిన మమ్మల్ని కొంతమంది స్థానికులుగా గుర్తించడం లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేష్‌లను ఉద్దేశించి మాట్లాడారు. మంత్రిగా పనిచేసిన రోజుల్లో మండలానికి ఎన్నో నిధులు తీసుకొచ్చానని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పెద్దపీట..
రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పెద్దపీ ట వేసిందని కడియం కావ్య అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన రెడ్డి కృతజ్ఞత సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. మీ ఇం టి బిడ్డగా బరిలో నిలబడుతున్నానని, ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.




