1 July, 2026 | 2:11 AM

క్రషర్‌కు వ్యతిరేకంగా పోరుబాట

01-07-2026 01:41 AM
  1. పది రోజులు నిరాహార దీక్ష చేసిన గ్రామస్తులు 
  2. పట్టించుకోని అధికార యంత్రాంగం 
  3. క్రషర్ యాజమాన్యానికి అధికార పార్టీ అండదండలు 

మేడ్చల్, జూన్ 30(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్రషర్ కు వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు పోరుబాట పట్టారు. రావల్కోల్ గ్రామ శివారులో సర్వేనెంబర్ 111 లో కొత్తగా క్రషర్ ఏర్పాటుకు అధికారులు అనుమతిని ఇచ్చారు. ఇది గ్రామానికి దగ్గరలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని, అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

క్రషర్ ఏర్పాటు చేయవద్దని అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష కూడా చేశారు. క్రషర్ ఏర్పాటు చేస్తున్న స్థలం వద్ద ఇటీవల పది రోజులు రిలే నిరాహార దీక్ష చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజా ప్రతినిధులు కూడా స్పందించలేదు. క్రషర్ గ్రామానికి దగ్గరలో ఉండటం వల్ల దుమ్ము ధూళి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. అంతేగాక పేలుళ్ల వల్ల ఇల్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అధికలోడు వాహనాలతో ఇబ్బందులు 

రావాల్కోల్ గ్రామంలో ఇదివరకే 7, 8 క్రషర్ లో ఉన్నాయి. వీటివల్ల గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు అధిక లోడుతో గ్రామం నుంచి వెళ్తున్నాయి. అధిక లోడ్ కావడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. అంతేగాక దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు జరుపుతున్నారు. బ్లాస్టింగ్ ప్రభావం గ్రామం  వరకు కనిపిస్తుంది. బ్లాస్టింగ్ వల్ల రాళ్లు సమీపంలోని పంట చేలలో పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రజాభిప్రాయ సమయంలో క్రషర్ ఏర్పాటును వ్యతిరేకించామని, అయినప్పటికీ అనుమతి ఇచ్చారని తెలిపారు. 

అనుమతులు గోరం.. తవ్వకాలు కొండంత 

ప్రస్తుతం గ్రామ సమీపంలో ఉన్న క్రషర్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గోరంత అనుమతుల తీసుకొని కొండంత తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాల లో నిబంధనలో పాటించడం లేదు. లోతుగా ప్రమాదకరంగా గుంతలు తీశారు. ఈ గుంతలు మనుషులకు పశువులకు ప్రమాదకరంగా తయారయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసే క్రషర్ వారు కూడా భారీ గుంతలు తవ్వే అవకాశం ఉందని గ్రామస్తులంటున్నారు. కొత్త క్రషర్ గ్రామానికి దగ్గరలో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతేగాక బ్లాస్టింగ్ లో వల్ల ఇల్లు దెబ్బ తినే ప్రమాదం ఉందంటున్నారు. 

అధికార పార్టీ నేతల అండదండలు 

క్రషర్ ఏర్పాటు వెనుక అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నప్పటికీ జబర్దస్త్ గా క్రషర్ ఏర్పాటు పనులు చేస్తున్నారు. ఒకవైపు నిరాహార దీక్ష చేస్తుంటే మరోవైపు భూమి చదును చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉందని క్రషర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం అనుమతులు రద్దు చేయించాలనే పట్టుదలతో ఉన్నారు. క్రషర్ అనుమతులు రద్దు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు.