26-08-2025 12:05:36 AM
తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన మారం పవిత్ర
పవిత్రకే కాదు పెన్ పహాడ్ మండలానికి గుర్తింపు వచ్చిందంటున్న మండల ప్రజలు
పెన్ పహాడ్: విద్యారంగంలో కృషి, పట్టుదల, నిబద్ధతతో విశిష్ట గౌరవం తన స్వంతం చేసుకొని జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మంచి గుర్తింప-తెచ్చుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిపోయింది ' మారం పవిత్ర'. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రములోని ఉన్నత పాఠశాలలో బయోలజీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్న పవిత్ర 2021లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును ఆనాటి విద్యాశాఖా మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
అంతేకాదు విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో పవిత్ర సరికొత్త బోధన పద్ధతులు.. సమాజంలో విద్యా ప్రాధాన్యతను దృష్టిలోపెట్టుకొని విద్యార్థులకు సులభతరరీతిలో విద్యాబోధన.. బాలికల విద్య ప్రాముఖ్యత.. వినూత్న రీతిలో ప్రయోగ శాల బోధన పలు అంశాలపై ప్రత్యేకంగా పవిత్రకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పవిత్ర స్వంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు చేసుకోగా, వారిలో సూర్యాపేట జిల్లాకు చెందిన మారం పవిత్రను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు కోరిన నేపథ్యంలో ఆమె అవార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని 'విజయక్రాంతి 'కి ఆమె తెలిపారు. సూర్యాపేట జిల్లాకే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాధికారి నకిరేకంటి రవి, మండల ఉపాధ్యాయ బృందం, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 45 మంది టీచర్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డును ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పవిత్ర ఉత్తమ జాతీయ పురస్కారం అందుకొన్నారు.