calender_icon.png 26 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు ఇవ్వకుంటే తిరుగుబాటే

26-08-2025 03:18:58 AM

  1. పార్టీ పరంగా రిజర్వేషన్లు వద్దే వద్దు
  2. బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం
  3. సత్యాగ్రహ దీక్షలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
  4. బీసీల ఆత్మగౌరవంతో చెలగాటం వద్దు: ఎంపీ ఈటల
  5. దీక్షకు హాజరైన ఆయా పార్టీల బీసీ నేతలు

ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించాలేగానీ, పార్టీలపరంగా మాత్రం వద్దేవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం రిజర్వేషన్లు కల్పించకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు బీసీలకు భిక్షం వద్దని, హక్కు కావాలని, మా జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వాలని, ఎన్ని రోజులు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారని  ప్రశ్నించారు.

గడిచిన 76 ఏళ్లుగా బీసీలకు అన్యాయం చేస్తున్నారని, ఇదే కొనసాగితే సహించే లేదని హెచ్చరించారు. సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రి వీ   శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, దూదిమెట్ల బాలరాజ్ గౌడ్, ఆనంద్ గౌడ్, రాజారాం యాదవ్, బీఎస్ రాములు, వీజీఆర్ నారగోని, శారదాగౌడ్, పలు బీసీ సంఘాల నేతలు హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా బీసీలు, కుల సంఘాలు, పలు బీసీ సంఘాల నేతలు తరలొచ్చి సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా ఇదిగో అదిగో 42 శాతం రిజర్వేషన్లంటూ హామీలు ఇచ్చి, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారని.. దీనివల్ల బీసీలకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. 76 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు బీసీలు ముఖ్యమంత్రులు కాలేదని, అగ్రకులాల వారికే అవకాశాలు లభించాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏ ఒక్క విధానం కూడా సక్రమంగా లేదన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వాటికోసం ప్రయత్నించాలని, ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తీసుకొని జీవో జారీ చేయాలన్నారు. లేనిపక్షంలో అసెంబ్లీలో మరోసారి బీసీ బిల్లు పాస్ చేసి గవర్నర్‌కు పంపితే ఆయన ఆమోదం తెలుపుతారని చెప్పారు. బీసీలకు మేలు జరుగుతుంటే బీజేపీ ఎప్పుడూ అడ్డుపడదన్నారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునేందుకే కాంగ్రెస్ నాటకమాడుతూ.. నెపాన్ని కేంద్రంపై నెట్టివేస్తోందని ఆరోపించారు. 

ఆత్మగౌరవంతో చెలగాటం వద్దు..

బీసీల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే, మమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసగించే ప్రయత్నం చేస్తే భరతం పట్టడం ఖాయమని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణయ్య చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ మాయమాటలు మాని తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీసీల సమస్యను అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ఉన్న బీసీ సమాజం కాంగ్రెస్‌ను క్షమించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, ఒక్కసారి కూడా బీసీ నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్లు అధికారంలో ఉన్నా వాళ్లే ముఖ్యమంత్రి అవుతారే తప్పా, బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం లేదన్నారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీల 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎంపీ ఆర్ కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని వెల్లడించారు. బీసీ బిడ్డలుగా ఆత్మ విమర్శలు చేసుకొని, ఎత్తిన జెండా దించకుండా పాలకులను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కోరారు.

బీసీలను సీఎం రేవంత్‌రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం పలు బీసీ సంఘాల నేతలు ఎంపీ ఆర్ కృష్ణయ్యకు నిమ్మరసం ఇచ్చి సత్యాగ్రహ దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్, బీసీ సంఘాల నేతలు జిల్లా పెళ్లి అంజి, వేముల రామకృష్ణ, సీ రాజేందర్, లాల్ కృష్ణ, మణికంఠ, అనంతయ్య, అశోక్, కృష్ణ, జగదీశ్వర్‌తో పాటు వందలాదిమంది బీసీ సంఘాల నేతలు,  విద్యార్థులు పాల్గొన్నారు. కళాకారుడు రామలింగం పాడిన పాటలు ఉత్తేజపరిచాయి.