26-08-2025 01:51:37 AM
అడ్డూ అదుపు లేదు!
కోన్ కిస్కా.. జాన్తానై!
ఈదుల నాగులపల్లిలో అక్రమ కాంపౌండ్ వాల్
సంగారెడ్డి, ఆగస్టు 25 (విజయక్రాంతి): ‘మాకు అధికారుల అండదండ లున్నాయి.. మేం ఏదనుకుంటే అది చేయగలం.. ఏ భూమిని కబ్జా చేయలన్నా చేస్తాం.. ఎక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా చేపడతాం.. రహదారులు అడ్డొచ్చినా, గ్రామస్తులకు అభ్యంతరాలున్నా లెక్కలేదు.. మాకు ఎవరి అనుమతులు అవస రం లేదు..’ అన్నట్లు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ వైఖరి ఉందని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపలి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలో రేడియల్ రోడ్డు నంబర్-7కి ఇరువైపులా సంస్థ 2.5 కి.మీ పొడవు, ౧౫ అడుగుల ఎత్తున కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నదని, రెవెన్యూశాఖ, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల కనుసన్నల్లోనే ఈ నిర్మాణం జరుగుతున్నదని చెప్తున్నారు. ఈ విషయంలో గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పైగా బడా సంస్థకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గ్రామస్తులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం సంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లు, ఆర్డీవోలు, రామచంద్రాపురం తహసీల్దార్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులకు నోటీసులు జారీచేసింది.
ఎవరు.. ఎందుకు నిర్మిస్తున్నారో..?
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న కాం పౌండ్ వాల్‌పై స్థానికులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సంస్థ అక్రమంగా రేడియల్ రోడ్డు నంబర్- 7కి ఇరువైపులా దాదాపు 2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నదని చెప్తున్నారు. కొల్లూర్ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి కొండకల్ వైపునకు వెళ్లే ఈ రేడియల్ మార్గంలోనే ఈ గ్రామం ఉంది. గ్రామ శివారులోని రైల్వేస్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల మేర వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అది కూడా అవతలేం జరుగుతుందో చూడలేనంత ఎత్తులో వాల్ నిర్మించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీస సమాచారం కూడా, వాల్ నిర్మించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాల్‌ను ఎవరు నిర్మిస్తున్నారో? ఎందుకు నిర్మిస్తున్నారో.. ? తెలియడం లేదని, అధికారులను ఈ విషయంలో ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని వాపోతున్నారు.
అధికారుల పొంతన లేని సమాధానాలు
కాంపౌండ్ వాల్ విషయమై రామచంద్రాపురం రెవెన్యూ అధికారులను వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఓసారి రైల్వేశాఖ వాల్ నిర్మిస్తోందని, మరోసారి ఆర్‌అండీబీ నిర్మిస్తున్నారని.. పూటకో మాట చెప్తున్నారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. రేడియల్ రోడ్డుకు రెండువైపులా ప్రభుత్వ స్థలం ఉండగా, కొంత రైల్వే ఆధీనంలో ఉన్న భూమి కూడా ఉంది. కాగా నాగులపల్లి, కొండకల్ శివారులో అపర్ణ సంస్థ వందల ఎకరాలు సేకరించగా పొజిషన్ విషయంలో అనేక సమ స్యలు తలెత్తాయి. దీంతో సంస్థ భారీ కాంపౌం డ్ వాల్ నిర్మాణానికి పూనుకున్నదని తెలుస్తున్నది. అక్రమంగా వాల్ నిర్మిస్తున్నా యంత్రాం గం చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు భావిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా.. ఫలితం శూన్యం
గ్రామంలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ విషయంలో గ్రామస్తులు తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. అయి నా, రెవెన్యూశాఖ ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. వాల్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కావొచ్చిందని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలోనూ గోడల నిర్మాణం జరుగుతున్నదని, అపర్ణ సంస్థ పేరును కూడా ప్రస్తావించి గ్రామస్తులు ఫిర్యాదు చేయడం గమనార్హం. అక్రమ వాల్ నిర్మాణంపై కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా స్పందన లేదని చెప్తున్నారు.
హైకోర్టులో ‘రిట్’..
గ్రామంలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్‌పై గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. ఎక్కడికి వెళ్లినా, వారికి న్యాయం జరగకపోవడంతో ఇటీవల వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, రామచం ద్రాపురం తహసీల్దార్, ఆర్‌అండ్‌బీ, రైల్వేశాఖ, పంచాయతీ శాఖలకు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. ఈ విషయంలో స్థానిక తహసీల్దార్ నుంచి మొదలుకొని ఆర్డీవో, జిల్లా అధికారుల వరకు అపర్ణ సంస్థకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ స్పందించకుంటే సీఎం దృష్టికి..
గ్రామంలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యం అక్రమంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్‌పై కలెక్టర్ ప్రావీణ్య స్పందించకుంటే తామంతా కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తామని, అవసరమైతే దీర్ఘకాలిక పోరాటాలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. వాల్ వ్యవహారంపై వివరణ కోరేందుకు ‘విజయక్రాంతి’ రామచంద్రాపురం తహసీల్దార్ సంగ్రా మ్‌రెడ్డిని ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.