calender_icon.png 26 August, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం అరిగోస

26-08-2025 02:01:41 AM

మా ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం

స్టాక్ ఉన్నా పంపిణీ చేయడం లేదు

యూరియా కొరతపై మండిపడుతున్న అన్నదాతలు

నల్లగొండ, ఆగస్టు 25 (విజయక్రాంతి)/తూప్రాన్/చేగుంట/ఇబ్రహీంపట్నం: రాష్ట్రం లో యూరియా కోసం రైతుల పడిగాపులు తప్పడం లేదు. యూరియా కొరతతో ప్రభు త్వం మా ఉసురు పోసుకుంటున్నదని, స్టాక్ ఉన్నా పంపిణీ చేయడం లేదంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. మెదక్ జిల్లా తూ ప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో సోమవారం యూరియా కోసం రైతులు నిరసనకు దిగారు. యూరియా పంపిణీ చేస్తున్నామని తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో రైతు వేదికలోకి వచ్చారు.

తీరా రైతులు వచ్చాక ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకాలు తీసుకొచ్చి క్యూలైన్‌లో నిల్చుంటేనే యూ రియా పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చేప్టటారు. కాగా ఎరువుల టోకెన్లు రాసే క్రమంలో రైతులు ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో రైతులు రైతు వేదిక వద్దకు రావడంతో పోలీసు లు బందోబస్తు నిర్వహించారు. ఎకరం, రెం డెకరాలు ఉన్న రైతులకు, ఐదెకరాలు ఉన్న వారికి ఒకే తరహాలో యూరియా పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్ర శ్నించారు.

మండల వ్యవసాయాధికారుల ని ర్లక్ష్యంతో ఇప్పటికే పంపిణీ చేయాల్సిన యూరియా గోడౌన్‌లలో నిలిపివేసి క్యూలైన్ పేరిట రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం ఐదు గంటల నుండి క్యూలో నిలబడ్డారు. వ్యవసాయ అధికారులు రైతులను లైన్లో ఉంచి ఒక్కరికి ఒక్క బస్తా చొప్పున పోలీసుల పహారా మధ్య టోకెన్లను అందజేశారు. మహిళా రైతులు సైతం ఉదయం వరుసలో నిల్చున్నారు.

నల్లగొండ జిల్లాలో సోమవారం చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే ఎరువుల కేంద్రాల వద్ద రైతన్నలు బారులుదీరిన పరిస్థితి నెలకొంది. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. ఇదే సమయంలో యూరియా కోసం రైతులు ఎరువుల కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అయినా మంత్రి వచ్చిన పని చూసుకుని తాపీగా వెళ్లిపోవడం కొసమెరుపు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. గత వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. కాగా సహకార సంఘంకు యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. 

మాజీ మంత్రి రెడ్యానాయక్ నిరసన

మహబూబాబాద్(విజయక్రాంతి): మ హబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని కురవి మండల కేంద్రంలో రైతులతో కలిసి యూరియా కొరతను నిరసిస్తూ మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో పరిపాలన పూర్తి గా గాడి తప్పిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిత్యం ఢిల్లీకి వెళుతూ వస్తున్నారని, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సూర్యాపేట, హైదరాబాదు నుంచి నియోజకవర్గానికి షటిల్ సర్వీసు చే స్తూ చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారని విమర్శించారు.

రాష్ర్ట ప్రజలు మార్పు కోరుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రజలకు, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సా గించలేక చతికిల పడ్డారని దుయ్యబడ్డారు. పంటల సాగుకు ముందే వానాకాలం సీజన్ కు అవసరమైన ఎరువులను, విత్తనాలను సి ద్ధంగా ఉంచాల్సిన ప్రభుత్వం, పాలకులు, ప్ర జాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

కిలోమీటరు క్యూ 

సిద్దిపేట రూరల్/బెజ్జంకి/కొండపాక: సి ద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో సోమవారం రైతు వేదిక వద్ద సుమారు కిలోమీటర్ వరకు రైతులు క్యూలో నిలబడ్డారు. పూల్లూరు రైతువేదిక గా యూరియా ఇస్తున్నట్టు సంచారం అందుకున్న వివిధ గ్రామాల రైతులు ఒకేసారి వచ్చి చేరారు. దీంతో కిలోమీటరు వరకు క్యూలో నిల్చున్నారు. బెజ్జంకి మం డల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బ స్తాల కోసం సోమవారం తెల్లవారు జాము 4 గంటల నుంచి రైతులు బారులు తీరారు. యూరియా ఒక లోడ్ బస్తాలకు రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లున్లో నమోదు చేసుకొని ఆధార్ కార్డుకు ఒకటి రెండు బస్తాల చొ ప్పున టోకెన్లు పంపిణీ చేశారు. కొండపాక మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూ రియా కోసం తెల్లవారుజామున నుంచి క్యూలో నిలబడ్డారు. యూరియా బండి రాగానే కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు రావడంతో పరిస్థితి చెక్కబడింది.

క్యూలో నిల్చున్న విద్యార్థి

నల్లగొండలో స్కూల్‌కి వెళ్లాల్సిన విద్యా ర్థి.. యూరియా కోసం క్యూలైన్ కట్టాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగ తి చదువుతున్న పాయలి మితిలేష్.. సోమవారం పొద్దున్నే పాఠశాలకు వెళ్లాలని యూ నిఫామ్ వేసుకొని తయారయ్యాడు. అయితే తమకు పొలం వద్ద పని ఉందని, దయచేసి రెండు యూరియా బస్తాలు ఇచ్చిపోమని త ల్లిదండ్రులు బతిమిలాడారు. దాంతో యూనిఫామ్‌తోనే వచ్చిన మితిలేష్ మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఎన్డీసీఎంఎస్ వద్ద ఉదయం 6 గంటలకే క్యూలైన్లో నిలిచి ఉన్నా డు. అప్పటికే తన ముందు ఉన్న లైన్ కాస్త పెద్దగా ఉండటంతో.. అతని వరస వచ్చేసరికి ఒక్క బస్తా కూడా రాకపోవడంతో నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

తోపులాటలో పగిలిన కౌంటర్ అద్దాలు

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవ సాయ కేంద్రం వద్ద సో మవారం ఉద్రిక్తత చో టు చేసుకుంది. పది రోజుల తర్వాత  సోమవారం యూరియా కేంద్రానికి రావడంతో రైతులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దీంతో క్యూలో వేచి ఉన్న రైతులు ఒక్కసారిగా ముందుకు రావడంతో కౌంటర్ అద్దాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ఇక చేసేదేం లేక సిబ్బంది యూరియా బిల్లులు ఇవ్వడం ఆపారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు చేరుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. 450 బస్తాలు రాగా 200 మందికి బస్తాలు అందాయి, మిగిలిన రైతులు నిరాశతో వెను తిరిగి వెళ్లిపోయారు.