24 May, 2026 | 5:16 PM

Breaking News

పిసిసి అధ్యక్షుని సన్మానించిన కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు   •   నవజాత శిశువు పట్ల జాగ్రత్తగా ఉండాలి   •   అటవీ సమీప గ్రామాల వారు తగు జాగ్రత్తలు పాటించాలి: ఎఫ్ఆర్ఓ   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ   •   రైతులను నిలువు దోపిడి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం   •   పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గుర్తింపు   •   వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడా.. ఎప్పుడూ జరగలేదు   •   మధ్య దళారులను నమ్మవద్దు   •   బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో యువకుడు ఆత్మ హత్య కలకలం   •   గుంజపడుగు గ్రామపంచాయతీ వర్కర్లకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్   •  

పీసీసీ పీఠం ఎవరికో?

17-06-2024 12:35 AM
  • పార్టీ పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ 

ఏ పదవీ లేనివారినే ఎంపిక చేస్తారా!

పదవికోసం ఢిల్లీలో లాబీయింగ్ మొదలు 

హస్తినలో మకాంవేసిన జగ్గారెడ్డి 

బీసీలకే అవకాశం దక్కుతుందని చర్చ

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్ఠం చేసే విధంగా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిని సారించింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌పై మరింత ఫోకస్ పెట్టారు. అందుకు రాష్ట్ర కాంగ్రెస్‌కు  నూతన రథసారధిపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది.  సామాజిక అంశాలతో పాటు  పార్టీ బలోపేతానికి  పూర్తిగా సమయం కేటాయించి.. భవిష్యత్‌లో జరిగే ఎన్నికలను సమర్థవంతంగా  ఎదుర్కొనే వారికే పట్టం కట్టాలనే ఆలోచనతో  ఉన్నట్లుగా తెలుస్తోంది. 

మంత్రులు, ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రభుత్వ పదవులు లేని వారికే   పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం  పీసీ సీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డినే కొనసాగుతున్నారు.  ఈ నెల 27తో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తికావ వడంతో.. పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమైంది.  అసెంబ్లీ ఎన్నికలు పూర్త యి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి  రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే, పార్టీ బాధ్యతలు కొత్తవారికి అప్పగిస్తారనే ప్రచారం జరిగింది.

అయితే  ఐదారు నెలల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో అధ్యక్ష మార్పు  వాయిదా పడింది. ఇప్పుడు  పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడం..  సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై పూర్తిగా సమయం కేటాయించాల్సి ఉంటుంది.  అటు  సీఎంగా, ఇటు  పీసీసీ చీఫ్ జోడు పదవుల్లో కొనసాగడం వల్ల పాలనపరంగా ఇబ్బందులు  ఉంటాయని, తద్వారా  పార్టీకి సమయం ఇవ్వడం కుదరదనే అభిప్రాయంతో హస్తిన పెద్దలు ఉన్నారు. పార్టీకి కొత్త సారథిపై కసరత్తు మొదలు పెట్టారు. 

పీసీసీ పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్.. 

 పీసీసీ అధ్యక్ష పదవీ కోసం డజన్ మంది వరకు పోటీ  పడుతున్నారు. ఎవరికి వారిగా ఢిల్లీ పెద్దల వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేసులో టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షలు జి. నిరంజన్, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి తో పాటు మంత్రి సీతక్క, ఎంపీలు బలరామ్‌నాయక్, సురేష్‌షెట్కార్ తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అధిష్ఠానం మాత్రం మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్న వారికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకోవడంతో.. ఇటీవల ఎన్నికలో పోటీ చేసిన ఓడిన వారికి అవకాశం ఇస్తారనే  చర్చ జరుగుతోంది.  వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం గత వారం పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు.  రాహుల్‌గాందీకి జగ్గారెడ్డి సన్నిహితంగా ఉండటంతో పార్టీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలనే చేసుకుంటున్నారు. 

బీసీలకే పీసీసీ చీఫ్ అవకాశం?  

 సీఎంగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా  ఎస్సీ సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్క ఉండటంతో.. పీసీసీ బాధ్యతలు బీసీ వర్గానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు మిగతా ఢిల్లీ పెద్దలతో మధుయాష్కీగౌడ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్ బాధ్యతలు తనకే వస్తాయని మధుయాష్కీ ధీమాతో ఉన్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న  మహేష్‌కుమార్‌గౌడ్‌కు పార్టీని సంస్థాగతంగా సమర్థవంతంగా నడిపిస్తున్నారనే పేరు ఉన్నది. అయితే  ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో.. మహేష్‌కుమార్‌గౌడ్‌కు అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ కూడా ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.  ఆ తర్వాత అంజన్‌కుమార్   తనయుడు అనిల్‌కుమార్‌కు రాజ్యసభ ఎంపీగా అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. దీంతో అంజన్‌కుమార్‌యాదవ్‌కు పీసీసీ చీఫ్‌గా అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్‌కుమార్ పోటీ పడుతున్నప్పటికి.. డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఉండటంతో ఆయనకు అవకాశాలు సన్నగిల్లినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత 50 ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్న తనకు పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇవ్వాలని పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు జి. నిరంజన్ కూడా మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఇతర నాయకులను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. అయితే  అధిష్ఠానం మదిలో మాత్రం ఎవరిదో ఒకరి పేరు ఉన్నప్పటికి.. సీఎం రేవంత్‌రెడ్డి చేసే సిఫారస్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా యూత్‌కు అవవకాశం.. 

పీసీసీ చీఫ్ పదవిని సీనియర్ నేతకు అప్పగిస్తే.. వర్కింగ్ పదవుల్లో యువతకు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది.  ప్రస్తుతం కొనసాగుతున్న  నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో  మహేష్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్‌లు ఉన్నారు. వచ్చే కార్యవర్గ  కూర్పులోనూ సామాజిక న్యాయంతో పాటు పార్టీకి విధేయులుగా ఉండి, గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి పెద్ద పీట వేస్తారని చెబుతున్నారు. ఇక మిగతా పదవుల్లోనూ కొత్త వారికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.