ఆ లేఖను పరిశీలిస్తున్నాం
- ‘విద్యుత్తు’ విచారణ కమిషన్ జస్టిస్ నర్సింహారెడ్డి
- కరెంటు కొనుగోళ్లపై కొనసాగుతున్న విచారణ
విచారణను తప్పుపడుతూ లేఖ రాసిన కేసీఆర్
కేసీఆర్ లేఖ అందినట్టు నిర్ధారించిన కమిషన్
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరావు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్న అంశాలు, అభ్యంతరాలను పరిశీలిస్తామని విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ ప్రకటించింది. శనివారం కేసీఆర్ రాసిన లేఖపై కమిషన్ ఆదివారం స్పందించింది. లేఖ తమకు అందిందని, దానిని పరిశీలిస్తున్నామని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి తెలిపారు.
లేఖపై విచారణ
కేసీఆర్ రాసిన లేఖపై విచారణ చేస్తున్నట్టు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తెలిపింది. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది. విచారణలో భాగంగా జరిగిన పరిణామాలను మాత్రమే తాను మీడియాకు వివరించానని, అయితే ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజమేనని జస్టిస్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. లేఖలో కేసీఆర్ చెప్పిన అంశాలను, వాస్తవాలతో సరిపోల్చాల్సి ఉందని అన్నారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ను కూడా విచారించాల్సి ఉందని, తద్వారా వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. లేఖలోని అంశాలను మంగళవారం విశ్లేషిస్తామని, దాని అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయాలను తెలిపే స్వేచ్చ ఉంటుందని తెలిపారు. ఈ లేఖలో పేర్కొన్న న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని కమిషన్ తన లీగల్ బృందాన్ని ఆదేశించింది.
తప్పు చేయకుంటే..
తప్పు చేయనప్పుడు విచారణ కమిషన్ ఎదుట హాజరైతే మాజీ సీఎం కేసీఆర్‌కు నష్టం ఏంటి? అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కోరడం వల్లే గత ప్రభుత్వంలోని విద్యుత్తు ఒప్పందాలపై కమిషన్ ఏర్పాటు చేశాం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బురద జల్లే ప్రయత్నం
పవర్ కమిషన్ ఉద్దేశం మరో విధానంగా ఉంది. వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తోంది. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నాలు సాగుతున్నాయి.
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
కమిషన్‌ను తప్పుపట్టడం సరికాదు
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల ఏర్పా టుపై సందేహాలకు కేసీఆర్, కమిషన్ ఎదుట వివరణ ఇచ్చి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేది. కానీ.. కమిషన్‌నే విమర్శిస్తూ లేఖ రాయడం విచారణ వ్యవస్థలను అగౌరవపరచడమే.
బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి






