calender_icon.png 15 October, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడిఎస్ బియ్యం పట్టివేత: ఎస్సై గణేష్

15-10-2025 08:24:10 PM

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం సుమారు 7:00 గంటలకు ముస్తాబాద్ ఎస్సై గణేష్ ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఎండి. ఖాసీం, పి.శ్రీనివాస్ లకు ముస్తాబాద్ గ్రామ శివారులోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం అందింది.

వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి,వారి అనుమతితో ముస్తాబాద్‌కు చెందిన విధూతి సాయిబాబా ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సుమారు 22 సంచులలో నిల్వ ఉంచిన 9 క్వింటాళ్ల బియ్యం లభించాయి. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన ఈ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ​కానిస్టేబుల్ ఎండి. ఖాసీం అందించిన దరఖాస్తు మేరకు, విధూతి సాయిబాబాపై కేసు నమోదు చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యంపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ముస్తాబాద్ పోలీసులు తెలిపారు. ప్రజల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.