పెండింగ్ బ్యాంక్ రుణాలను విడుదల చేయాలి
వెనుకబడిన తరగతుల జాతీయ కమిటీ
ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): యువత, పారిశ్రామిక వేత్తలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలు మూడేళ్లుగా బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ’అఖిల భారత ఓబీసీ పారిశ్రామికవేత్తల తెలంగాణ కమిటీ’ని ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఓబీసీ ఇండస్ట్రియల్ పాలసీ అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి భూములు, ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జూలై 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఓబీసీ యువతకు స్వయం ఉపాధి పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మహిళా సాధికారత లక్ష్యాన్ని స్వాగతిస్తూ, బీసీ మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.






