20 May, 2026 | 11:27 AM

ఇస్తారా..? ఇవ్వరా..?

19-06-2024 01:41 AM
  • రెండేళ్లుగా కొత్తగా అందని పింఛన్లు

27వేల మంది ఎదురుచూపులు

నిరుపయోగంగా సదరం సర్టిఫికెట్లు

కొత్త సర్కారు చేయూత అందించేనా?

ఆసరా కోసం అభాగ్యుల నిరీక్షణ

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 18(విజయక్రాంతి): పింఛన్ల కోసం ముసలిముతకా ఎదురుచూస్తున్నారు. ఆసరా కోసం అభాగ్యు లు ఆశల్లో ఉన్నారు. గత ప్రభుత్వం నూతన పింఛన్ల ప్రక్రియను నిలిపివేయడంతో రెండేళ్లుగా లక్షల మంది పింఛన్ల కోసం పడిగాపు లు కాస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న పింఛన్ హామీని నెరవేరుస్తుందనే ఆశల్లో ఊగిసలాడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం 54428 మంది పెన్షన్‌దారులున్నారు.

వీరి లో వృద్ధులు 23488 మంది,వితంతువులు  21770 మంది, దివ్యాంగులు 5884, గీత కార్మికులు 484, చేనేత కార్మికులు 134, బీడీ కార్మికులు 87, ఒంటరి మహిళలు 2581 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తరువాత ప్రతీ నెల అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేస్తూ వచ్చింది. ఆరు సంవత్సరాల పాటు సక్రమంగా సాగిన ప్రక్రియ అర్ధంతరంగా నిలిపివేసింది.  దీంతో చాలామంది అభాగ్యులు పింఛన్ల కోసం రెండేళ్లుగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

అర్హత కోల్పోతున్న సదరం సర్టిఫికెట్లు

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో సదరం సర్టిఫికెట్స్ క్యాంపులను ఏర్పాటు చేసి అర్హత కలిగిన దివ్యాంగులకు వైకల్య పత్రాలను అందిస్తున్నారు. వీరికి ఏడాది కా ల పరిమితి నుంచి ఐదేళ్ల కాల పరిమితితో దృవప్రతాలను అందిస్తున్నారు. 2022 జూన్ నుంచి నూతనంగా పెన్షన్లు మంజూ రు కాకపోవడంతో ఏడాది , రెండేళ్ల కాల పరిమితి సర్టిఫికెట్టు నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్యాలయాలకే పరిమితమైన దరఖాస్తులు

రెండేళ్లుగా ప్రభుత్వం నూతన పెన్షన్లు మంజూరు చేయక పోవడంతో అర్హులైన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా లబ్ధిదారులు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయల్లో దరఖాస్తులు అందజేశారు. ఫింఛన్ కోసం దాదాపుగా 27,166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,403 మంది దివ్యాంగులు ఉన్నారు.  

చేయూత కోసం ఎదరుచూపులు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమ లు చేస్తామని వాటిలో భాగంగా  చేయూత పథకంలో పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం కొలువు దీరి ఆరు నెలలు గడుస్తున్నా పింఛన్ల ఊసే లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది.  అసలు ఇస్తారా? ఇవ్వరా? గత సర్కారు మాదిరి మొండి‘చేయి’ చూపించనట్టేనా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


మంజూరు వస్తే పంపిణీ చేస్తాం

జిల్లాలో ప్రస్తుతం 54,426 మందికి పెన్షన్లు తీసుకుంటున్నారు. ఏప్రిల్‌లో 639 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. కానీ, నిధులు రాలేదు. డబ్బులు రాగానే వారికి అందిస్తాం. ఇటీవల వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేశాం.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. అనుమతులు రాగానే అందరికీ అందిస్తాం. 

 సురేందర్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, ఆసిఫాబాద్

పెన్షన్ పెంచితే బాగుంటుంది 

పెన్షన్ పెంచితే మరింతగా ఆసరా అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు 4వేలు చేస్తమన్నరు. వృద్ధులమైన మేం పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకు పెంచిన ఫించన్ తొందరగా ఇస్తే బాగుటుంది. కుటుంబానికి ఆర్థికభారం తగ్గుతుంది.

 బోయిని రాజయ్య, అంకుశాపూర్