calender_icon.png 13 August, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐరిస్‌తో పింఛన్.. లేదిక టెన్షన్!

11-08-2025 12:27:53 AM

-పింఛన్‌దారుల కష్టాలకు చెక్ వేలిముద్రల 

-ఇబ్బందులకు దూరం

కొండాపూర్, ఆగస్టు 10 : వేలిముద్రలు పడక, పింఛన్ రాక పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు, ఇతర పింఛన్దారుల కష్టాలు తీరనున్నాయి. ఐరిస్ (ముఖ గుర్తింపు)తో చేయూత పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పింఛన్ మంజూరు అవుతున్నా, పొందేందుకు వృద్ధులు, వితంతువులు, ఇతరులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర రంగ కార్మికులు కూలీ పనులు చేస్తుండడంతో చేతి, వేళ్ల రేఖలు అరిగిపోతుంటాయి. దీంతో పింఛన్ పొందేందుకు వెళ్లగానే వారికి వేలిముద్రలు సరిపోలక పింఛన్ అందడం లేదు. ఆ సమస్య ఐరిస్ (ముఖ గుర్తింపు) ద్వారా తీరనుంది. 

జిల్లాలో 1.54 లక్షల పింఛన్‌దారులు..

సంగారెడ్డి జిల్లాలో 1.54 లక్షల పింఛన్దారులకు ప్రభుత్వం రూ.36.10 కోట్లను అందజేస్తుంది. ఇందులో కొందరు పోస్టాఫీస్ ద్వారా, మరికొందరు బ్యాంకు ఖాతా ద్వారా పింఛన్ పొందుతున్నారు. బ్యాంకు ఖాతా ద్వారా పొందుతున్న వారు తక్కువగా ఉండడంతో వారికి ఇబ్బందులు అంతగా లేవు. కానీ పోస్టాఫీస్ ద్వారా పొందుతున్న వారికి వేళ్ల రేఖలు అరిగిపోవడంతో బయోమెట్రిక్ సాధ్యంకాక పింఛన్ పొందడం లేదు. వారందరికీ గతనెల 29 నుంచి ఫేసియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారం తీసుకుంటుంది.

మొదట పోస్టాఫీస్ ద్వారా పింఛన్లు పొందే వారికే ఈ విధానం అమలు చేయనుంది. నగరాలు, పట్టణాల్లో బ్యాంకుల్లో పింఛన్లు పాందుతున్న వారికి మాత్రం ప్రస్తుత విధానమే అమలులో ఉంటుంది. తాజాగా గతనెల 30న పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని వార్డులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ గుర్తింపును ప్రారంభించారు. ఈ కొత్త విధానం కోసం యాప్ను రూపొందించారు. పోస్టుమాస్టర్లు, పోస్టుమ్యాన్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కొత్త ఫోన్లను అందజేయనున్నారు. అనంతరం వారు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలావుండగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల నుంచే ఐరిస్ ద్వారా పింఛన్ పంపిణీ చేపట్టారు. జోగిపేట పరిధిలోని అల్మాయిపేటలో మోడల్ నిర్వహించారు. పింఛన్దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నూతన విధానం అమలులోకి తీసుకొచ్చిందని డీఆర్డీఓ అధికారులు చెబుతున్నారు. 

జిల్లాలో పింఛన్‌దారులు వివరాలు...

జిల్లాలో పింఛన్దారులు 1.54 లక్షల మంది ఉండగా అందులో వృద్ధాప్య పింఛన్లు 58,457, వికలాంగ పింఛన్లు 14,334, వితంతువు 70,183, చేనేత కార్మికులు 673, కల్లుగీత 805, ఒంటరి మహిళలు 112, బీడీ కార్మికులు 7,448, ఏఆర్టీ 2,032, ఫైలేరియా 374, డయాలసిస్ 280 మంది పింఛన్దారులుఉన్నారు..