16 August, 2026 | 3:31 AM

ప్రజా నాయకుడు జగ్గారెడ్డి

16-08-2026 12:13 AM
  1. రాహుల్ గాంధీ రాముడైతే.. హనుమంతుడు జగ్గారెడ్డి!
  2. జగ్గారెడ్డి ఎక్కడ పోటీ చేయాలో రాహుల్ గాంధీ చెప్తారు
  3. సంగారెడ్డి సభలో సీఎం రేవంత్‌రెడ్డి

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ రాముడైతే.. జగ్గారెడ్డి హనుమంతుడు అని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన కంటే ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండేది జగ్గారెడ్డి అని, ఆయనకే మొదటి మార్కులు అంటూ కొనియాడారు. జగ్గారెడ్డి ని ఓడగొట్టుకున్న దురదృష్టవంతులు మీరే. జగ్గారెడ్డి లాంటి నాయకుడు ఉన్నందుకు అదృష్టవంతులు కూడా మీరేనని సంగారెడ్డి ప్రజలను ఉద్దేశించి అన్నారు.

వంద కోట్లు ఇచ్చినా ఇలాంటి నాయకుడు ఉండడని తెలిపారు. రాహుల్ గాంధీ మాటను తూచా తప్పకుండా పాటించే నాయకుడు జగ్గారెడ్డి అని, జగ్గారెడ్డి లాంటి ప్రజా నాయకుడు అవసరమని స్పష్టం చేశారు. ఈ సందర్భం గా జగ్గారెడ్డి భార్య నిర్మల జగ్గారెడ్డి గురించి మాట్లాడగా సీఎం స్పందిస్తూ.. ‘అక్కకు ఇచ్చే ది అక్కకు ఇస్తా.. జగ్గన్నకు ఇచ్చేది జగ్గన్నకి ఇస్తా’ అంటూ ప్రకటించారు. పోటీ చేయను అని ఇంకోసారి అనొద్దు జగ్గన్నా అంటూ చెప్పారు.

పోటీ చేయాలా వద్దా అనేది రాహుల్ గాంధీ చూసుకుంటారని చెప్పారు. కర్ణాటకలో బోసు రాజును మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారని, జగ్గారెడ్డి విషయంలో ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదన్నారు. అది రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎక్కడ నుండి పోటీ చేయాలి అనేది అది రాహుల్ గాంధీ చూసుకుంటారని, ఎక్కడైనా జగ్గారెడ్డి మాత్రం ప్రజాక్షేత్రంలో ఉండాలన్నారు. 

సంగారెడ్డిలో సభ సక్సెస్ వెనుక జగ్గారెడ్డి కృషి

సంగారెడ్డిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం సభ విజయవంతమైంది. గత వారం రోజుల నుండి సీఎం సభ నిర్వహణ కోసం జగ్గారెడ్డి అన్నీ తానై కార్యక్రమాలను చూసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కార్యక్తలను, నాయకులను, అధికారులను సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పూర్తి చేయించారు. సీఎం సభ సక్సెస్ చేసేందుకు సంగారెడ్డి నియోజకవర్గం కార్యకర్తలను, ప్రజాప్రతినిధుతో సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమన్వయం చేశారు.