ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన 40మంది సస్పెండ్
09-05-2024 12:52 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి) : ఎన్నికల విధులకు డుమ్మ కొట్టిన వారిపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కొరడా ఝులిపించారు. ఎన్నికల విధులకు హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా సదరు ఉద్యోగులు స్పందించకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ విధులు చేపట్టాల్సిన 40మంది పీఓలు, ఏపీవోలను ప్రజా ప్రాతినిధ్య (ఆర్‌పియాక్ట్) 1951 చట్టాన్ని ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్టు రోనాల్డ్ రోస్ తెలిపారు. గతంలో ఎన్నికల శిక్షణకు హాజరుకాని 40మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 9, 10తేదీల్లో జరగనున్న శిక్షణ తరగతులకు హాజరు కాని వారిపై కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.




