తప్పుచేసిన వారిని ప్రజలు చెప్పుతో కొడతారు
ప్రజా సమస్యలు వదిలేసి కాంగ్రెస్‌ను విమర్శలా?
బీఆర్‌ఎస్‌పై నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి ఫైర్
సూర్యాపేట, జూన్ 20: ఆధారాలు, గణాంకాలు లేకుండా ఎవరు మాట్లాడరనేది బీఆర్‌ఎస్ నాయకులు గ్రహించాలని.. తప్పున్న వారిని ప్రజలు చెప్పుతో కొడతారనేది విస్మరించొద్దని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజా సమస్యల గురించి మానేసి కాంగ్రెస్ నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో 70 వేల ఓట్ల మెజార్టీ వచ్చేలా చేసిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఙతలు తెలిపారు.






