కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో మహిళ ఆత్మహత్య
దొంగతనం నింద మోపడంతో మనస్తాపం
నాగర్‌కర్నూల్, జూన్ 20 (విజయక్రాంతి): దొంగతనం నింద మోపడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ పట్టణానికి చెందిన లక్ష్మి(28) పట్టణంలోని సాయికృప ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. గతేడాది ఆస్పత్రిలో జరిగిన దొంగతనం కేసులో ఆమెపై అనుమానంతో పదేపదే పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు. గురువారం కూడా పోలీసులు కేసు విచారణ పేరుతో పిలవడంతో అవమానంతో మనస్తాపం చెందిన లక్ష్మి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుర్చీ మీద నుంచి కింద పడడంతో ఫిట్స్ వచ్చిందని భావించిన ఎస్సై రుషికేష్ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మార్గమధ్యంలోనే మృతి చెందింది. దీనిపై సీఐ మహేష్ వివరణ ఇస్తూ లక్ష్మిని ఎలాంటి ఒత్తిడి పెట్టలేదన్నారు.






