03-11-2025 03:16:59 AM
							బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ డిమాండ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో నామినేటెడ్ పోస్టులలో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జిపి, ఏజిపి స్టాండింగ్ కౌన్సిల్స్, అన్ని ప్రధాన శాఖలన్నీ అగ్రకులాల గుప్పిట్లో పెట్టుకుని ప్రాధాన్యత లేని శాఖలు, బీసీలకు కేటాయించడం సరికాదని అసోసియేషన్ విమర్శించింది.
ఆది వారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్య క్షుడు తలకొక్కుల రాజు, జనరల్ సెక్రెటరీ పొన్న దేవరాజు గౌడ్ మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లుకు సుప్రీంకోర్టు, హైకోర్టు కోర్ట్ తీర్పులను అడ్డు తొలగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వే షన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని సూచిం చారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకాలలో కొలీజియం విధానం బీసీలకు శాపంగా మారిందన్నారు.
తక్షణమే యూపీఎస్సీ తరహాలో నియామకాలు జ్యూడిషరీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి 42 శాతం రిజర్వేషన్లు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలలో చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో నామినేట్ పోస్టుల్లో బీసీలకు 42 శాతం కేటాయించాలని స్పష్టం చేశారు. బార్ కౌన్సిల్ ఎన్నికలలో కూడా రిజర్వేషన్ విధానం అమలు చేయాలని కోరారు. బీసీ జూనియర్ న్యాయవాదులకు నెలకు 30 వేల రూపాయలు స్టయిఫండ్‌గా ప్రకటించాలని కోరారు. ఎన్రోల్మెంట్ అయిన ప్రతి బీసీ న్యాయవాదికి ఇన్సూరెన్స్ కవరేజ్ వెంటనే ఇవ్వాలని, అడ్వకేట్స్ కి ట్రైనింగ్ అకాడమీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.
సమావేశంలో బిఎస్ ప్రసాద్, ఎక్స్ అడ్వకేట్ జనరల్ తెలంగాణ, కె సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ తెలంగాణ, పొన్న అశోక్ గౌడ్, మాజీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ తెలంగాణ, వి రఘునాథ్, హైకోర్టు మాజీ అధ్యక్షుడు, జగన్, హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్, టి గిరి, కరిక మల్లేష్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.