5 August, 2026 | 9:31 PM

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేసే వ్యక్తి రిమాండ్

05-08-2026 08:30 PM

ఏసిపి భీమ శర్మ 

 జనగామ,(విజయక్రాంతి): లింగ నిర్ధారణ పరీక్ష చేసుకొని అక్రమ గర్భస్రావం చేయించుకొని ఇటీవల అంబాల శ్రావణి అనే యువతి మరణించగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన నుండి పోలీసులు వరంగల్ సిపి ఆదేశాలతో వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో ముమ్మారంగా దర్యాప్తు చేపట్టారు.

బుధవారం రోజున జనగామలోని షామీర్పేట్ బైపాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సీఐ సత్యనారాయణ రెడ్డి నిందితుడిని తన సిబ్బందితో కలసి పట్టుకొని అతని విచారించగా అతను చేసిన నేరం ఒప్పుకోగా వెంటనే నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వేముల ప్రవీణ్ (35)గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి రెండు స్కానింగ్ యంత్రాలు, హోండా కారు, రెండు మొబైల్ ఫోన్లు, నగదు రూపాయలు 15000 స్వాధీనం చేసుకున్నారు.

విలేకరుల సమావేశంలో ఏసీపీ భీమశర్మ మాట్లాడుతూ... ప్రాథమిక విచారణలో నిందితుడు ప్రభుత్వ అనుమతులు లేకుండా స్కానింగ్ యంత్రాల ద్వారా గర్భిణులకు అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇందుకోసం వివిధ జిల్లాలకు చెందిన కొందరు ఆర్ఎంపీలు, మధ్యవర్తుల ద్వారా గర్భిణీలను తన వద్దకు పంపించేవారని, ఒక కేసు కు 5000 నుండి 8000, వరకు నగదు తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడిన నేపథ్యంలో 2021, 2023 సంవత్సరాలలో హనుమకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం ఐదు కేసులు నమోదయి వాటిలో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మృతురాలు అంబాల శ్రావణి గర్భిణిగా ఉండగా 2026 జూలై 21 రచ్చ శ్రావణ్ కుమార్ ద్వారా హనుమకొండలోని  ఒక క్లినిక్ వచ్చినట్లు అక్కడ నిందితుడు ఆమెకు అక్రమంగా స్కానింగ్ నిర్వహించి. గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిపినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఆమెకు అక్రమ గర్భస్రావం జరిగినట్లు ఆరోపణలు ఉండగా, ఆరోగ్య పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మరణించిన ఘటన పై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఈ మోసాలకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్ఫెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, కానిస్టేబుల్స్ కర్ణాకర్ సాగర్ కృష్ణ భాస్కర్లను సి పి అభినందించారు.