16 July, 2026 | 8:12 AM

గొర్రెల పంపిణీ స్కాంలో నిందితుడి పిటిషన్ డిస్మిస్

07-06-2024 01:58 AM

హైదరాబాద్, జూన్ 6, (విజయక్రాంతి): గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనపై కేసు కొట్టివేయాలన్న నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ అభ్యర్థనను గురువారం హైకోర్టు తిరస్కరించింది. ఏపీ పల్నాడు జిల్లా విర్పూర్ మండలానికి చెందిన సన్నెబోయిన ఏడుకొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయా లంటూ మొహిదుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ కే సుజన గురువారం తీర్పు చెప్పారు.

పిటిషనర్ రవాణా వ్యాపారం చేస్తుంటారని, పశుసంవర్థకశాఖ నుంచి టెండర్లు పొంది గొర్రెలు వంటి జీవాలను లబ్ధిదారులకు రవాణా చేస్తుంటారని, అయితే 2021 సంవత్సరాల మధ్య ఎలాంటి టెండరు రాకపోవడంతో కోర్టులో కేసు వేశారని న్యాయవాది చెప్పారు. దీంతో కక్షకట్టిన అధికారులు అక్రమ కేసు బనాయించారని చెప్పారు. ఏసీబీ తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు పోలీసుల తరఫున ఏపీపీ ఎస్ గణేష్ వాదించారు.

ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము గొర్రెల యజమానులకు అందలేదని, కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందని, కోర్టులో నిర్ధోషిత్వాన్ని నిరూపిం చుకోవాలని అన్నా రు. స్కాంపై దర్యాప్తు జరుగుతోందని, కింది కోర్టులో తేల్చుకోవాల్సి ఉందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, పిటిషనర్ ఫిర్యాదు చేసిన దానిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి పిటిషన్‌ను కొట్టివేసింది.