16 July, 2026 | 3:53 AM

విద్యార్థులకు యూనిఫాం అందించాలి

07-06-2024 01:59 AM

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 6 (విజయక్రాంతి): పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు(యూనిఫాం) అందించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. హవేళీ ఘణపూర్ మండలంలోని ఫరీద్‌పూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకరూప దుస్తుల కుట్టు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసమే ఏకరూప దుస్తుల కుట్టు పనిని మహిళా సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు. విద్యార్థులకు 12వ తేదీలోపు స్కూల్ యూనిఫాం అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. 

సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య..

సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపా రు. హవేళీఘణపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామ పాఠశాలలో చేపడుతున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న బడులను బాగు చేసి విద్యా బోధనకు అనుకూలంగా మారుస్తున్నట్లు తెలిపారు. మరమ్మతు పనులను పాఠశాలలు తెరిచేలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బడి మానేసిన పిల్లలందరినీ తిరిగి చేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని తెలిపారు.