పాఠశాలలకు మూలస్తంభాలు పీఈటీలు
* ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): పాఠశాలల అభివృద్ధిలోను, విద్యార్థుల సర్వాంగీణ వికాసంలోను వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు మూలస్తంభాల వంటివారని ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. మంగళవారం ఉట్నూర్ కేజీబీవీ కాంప్లెక్స్ పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో జరుగుతున్న ఆశ్రమ పాఠశాలల పీఈటీల శిక్షణా తరగతులను ఆయన సందర్శించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో ఏ ఉపాధ్యాయుడు గుర్తున్నా, లేకపోయినా వ్యాయామ ఉపాధ్యాయుడు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
విద్యార్థులతో మమేకమై, వారితో ఆడుతూ పాడుతూ కలిసిపోవడం ఒక్క పీఈటీలకే సాధ్యమని చెప్పారు. ప్రతి విద్యార్థి ‘ఫిట్’గా ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిదేనని ఉద్ఘాటించారు.క్రీడా మైదానాల కొరతను సాకుగా చూపకుండా, అందుబాటులో ఉన్న చిన్న మైదానం మరియు వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చని వివరించారు. ప్రతి వారం ఒక నిర్దిష్టమైన అంశాన్ని విద్యార్థులకు అందించి, విద్యార్థులు ఆ అంశం చుట్టూ ఆలోచించేలా చేయాలని సూచించారు.
తద్వారా ఆయా విషయాలపై విద్యార్థులకు సంపూర్ణ పరిజ్ఞానం లభిస్తుందని తెలిపారు. విద్యావ్యవస్థ అంతా విద్యార్థి కేంద్రంగా, వారి వికాసానికి తోడ్పడేలా ఉండాలని కోరారు. పీఈటీలు విద్యార్థులను ఇన్‌స్పైర్ స్ఫూర్తినింపేలా చేసేలా ఉండాలని, వారిని చూసి నడుచుకునేలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ గోడం చందన్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, పి ఈ టి బుక్యా రమేష్, డిసిబిఎం మాల్యాలు, ప్రధానోపాధ్యాయుడు ఆర్.ఉత్తం, రిసోర్స్ పర్సన్లు వి. భూమన్న, ఎల్.ఎన్ శాస్త్రి తదితరులు ఎం.ఎల్.ఇ. టి. దేవురావు తదితరులు పాల్గొన్నారు.






