తొలి సంఘ సంస్కర్త ఫూలే
వనపట్ల సుబ్బయ్య :
సత్యశోధన కోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు ఫూలే జన్మించి నేటికీ 199 సంవత్సరాలు పూర్తయ్యా యి. ఈ ఏడాది ఏప్రిల్ 11న ద్విశతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కుల నిర్మూలన ఉద్యమానికి బాటలుపరిచి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన మహాత్ముడు ఫూలే. భారత సామాజిక పునర్నిర్మాణ కర్తగా ఫూలే చిరస్మరణీయుడు. మహాత్మా ఫూలే జీవితం, ఆయన సిద్ధాంతం, పోరాటం, ఆచరణ, స్ఫూర్తి ఈనాటి భారతీయ సమాజానికి ఎం తో అవసరం. సామాజిక అంతరాలపై నిప్పు ల ప్రశ్నలను కురిపించిన సామాజిక శాస్త్రవేత్త ఫూలే.
సామాన్యులకు, అణచివేతకు గురైనవారికి, పీడితులకు, భారతీయ స్త్రీలకు నూతన యుగోదయాన్ని ప్రకటించిన మొద టి భారతీయుడు జ్యోతిరావు ఫూలే. అట్టడుగు వర్గాల జీవితాల్లో కమ్ముకున్న అంధ కారాన్ని తొలగించడానికి దీపం చేతబట్టి నడిచిన ధీరోదాత్తుడాయన. విద్యే వికాసమన్న తొలి సంస్కర్త. కోట్లాది ప్రజలు మ హాత్ముడిగా కొలుస్తున్న జ్యోతిబాఫూలే 1827 ఏప్రిల్ 11న గోవిందు చిమ్నాబాయి దంపతులకు మహారాష్ట్రలోని పునా పట్టణంలో జన్మించారు.
19వ శతాబ్దంలో దళి తుల స్థితి కడు దుర్భరంగా ఉండేది. పీష్వాల పాలన అస్పృశ్యత, అణచివేత, బానిసత్వానికి పెట్టింది పేరు. అగ్రకులాలతో సమా నంగా వీధులలో నడవకూడదని మెడకు ముంత, నడుముకు చీపురు కట్టుకొని మిగతావారు రావాల్సిన పరిస్థితి. కులవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడటమే ఆనాటి సాహ సం. బ్రాహ్మణ మిత్రుని పెళ్లిలో జరిగిన అవమానం జ్యోతిబాను తీవ్ర క్షోభకు గురి చేసింది. ఈ నేపథ్యంలో థామస్ పైన్ రచించిన ‘రైట్స్ ఆఫ్ మాన్’ పుస్తకంతో ప్రభావి తుడైన ఫూలే హక్కుల పోరాట యోధుడిగా నిలిచారు. అస్పృశ్యత, అంటరానితనంపై సామాజిక తిరుగుబాటు చేస్తూ సమత , న్యాయం కోసం ఉద్యమించారు.
జ్యోతిబా స్వయంగా తన వాకిట్లోని బావి నీళ్లను తోడి దళితుల దాహార్తి తీర్చిన గొప్ప ఆదర్శప్రాయుడు. పూలేను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నారు. అణగారిన వర్గాల వారు చదువు కుని విద్యావంతులైతే సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారని, విద్య ద్వారానే ఆత్మగౌరవం వస్తుందని ఫూలే విశ్వసించారు. అందుకే ఆధునిక భారతదేశ చరిత్రలో మా నవ సమాజానికి కావల్సిన విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ 1848 జనవరి 1న నిమ్నకులాల బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించారు.
తన భార్య సావిత్రి బాయికి స్వయంగా విద్య బోధించి, తాను స్థాపించిన పాఠశాలలోనే తొలి ఉపాధ్యాయురాలిని చేసి స్త్రీ విద్యకు పాటుపడు తూ తొలి అక్షర కిరణమయ్యారు. సావిత్రిబాయి మొదటి భారత ఉపాధ్యాయిని. స్తీలు చదువుకోవడానికి అనర్హులంటూ సనాతనవా దులు ఆమెను అడ్డగించేవారు. ఆమెపై పేడ నీళ్లు, రాళ్లు, చెత్త వేసి అవమానించేవారు. అయినా సావిత్రిబాయి తొణకలేదు, బెదరలేదు.
పేద వర్గాలకు అక్షరాలను బోధించ డం మానలేదు. పగలంతా పారిశుద్ధ్య కార్మికుల కోసం దేశంలోనే మొదటగా రాత్రిపూ ట బడి నడపడం ప్రారంభించారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తుల అభ్యున్నతి కోసం తమకున్న ఆలోచనలను ఆచరణలో పెట్టిన మహనీయుడు ఫూలే.
ఫూలే దంపతులు విద్య బోధనకు మాత్ర మే పరిమితం కాలేదు. వితంతువుల సంక్షేమానికి వితంతు శరణాలయాన్ని స్థాపించా రు. దీనజనుల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఫూలేను చంపేందుకు వచ్చి నవారు సైతం ఆయన మాటలతో మనసు మార్చుకున్నారు. వారికీ విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప వ్యక్తి ఫూలే. ఫూలే దంపతుల కు సంతానం లేకపోవడంతో, ఒక బ్రాహ్మ ణ వితంతువు (కాశీబాయి)కు పుట్టిన బిడ్డను దత్తత తీసుకొని యశ్వంత్‌రావు అని పేరు పెట్టుకున్నారు.
ఆ కాలంలో వితంతువు బిడ్డ ను దత్తత తీసుకోవడమనేది పెద్ద నేరంగా పరిగణించేవారు. యశ్వంత్ రావు వైద్య వి ద్య అభ్యసించి బ్రిటిష్ సైన్యంలో సివిల్ సర్జన్‌గా పనిచేశారు. ఫూలే స్వయంగా కవి, రచ యిత. భారతీయ కుల వ్యవస్థలోని అణచివేతను, బాని సత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తిరుగుబాటు చేసిన రచన ‘గులాంగిరీ’. ఆ రచనలోని ఆలోచనలు కోట్ల మందిని ప్రభావితం చేస్తూ నూతన ఆలోచనలు రేకెత్తించా యి.
వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేటట్టు చేశాయి. సేద్యకారుడు, చర్నాకోల, తృతీయ రత్న కావ్యాలతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కీర్తిస్తూ ఫూలే పావడా లు రాశారు. బ్రాహ్మణులు కింది వర్గాల ప్ర జలను ఏ విధంగా అణచివేస్తూ అజ్ఞానానికి గురిచేస్తున్నారో, సర్వజనులకు సత్యం, ధర్మం ఒకే విధంగా ఉండాలని, కులాల్ని బట్టి సత్యధర్మాలు ఉండవని తెలిపిన గ్రంథ మే ‘సార్వజనిక సత్యధర్మ’.
1873 సెప్టెంబర్ 24న తన సహచరుల తో ‘సత్యశోధక్ సమాజ్’ సంస్థను ఫూలే ఏ ర్పాటు చేశారు. వేదాలను తిరస్కరిస్తూ పురోహితుడు లేకుండా పెళ్లి చేయడం మొదలె ట్టారు. పెళ్లి తంతులోని దోపిడీని అడ్డుకుంటూ మూఢనమ్మకాలు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు, మహిళలకు విద్య, సామాజిక హక్కులు కల్పించడం, కుల వివక్షకు వ్యతిరేకంగా, స్వేచ్ఛా సమాన త్వం సౌభ్రాతృత్వాలు, సమాన అవకాశాల కోసం పోరాడారు. బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు పునర్వివాహాలను జరిపిం చడమే కాకుండా, సామాజిక సాంఘిక అసమానతలపై ఈ సంస్థ పోరాటం చేసింది. భారతీయ సాంస్కృతిక పునర్జీవనంలో సత్యశోధక్ సమాజ్ పాత్ర శ్లాఘనీయమైనది.
జ్యోతిబా పూనా మున్సిపల్ కౌన్సిల్ స భ్యునిగా పని చేశారు. ఆ కాలంలో పూనా ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. మున్సిపల్ సభ్యుని హోదాలో కరువుపై తీవ్ర పో రాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూనా ప్రాంతంలో 52 ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేయించారు. చరిత్రలో ప్రముఖంగా నిలిచిన విక్టోరియా శర ణాలయం ప్రత్యేకమైనది. దీనబంధు పత్రిక స్థాపించి శూద్రుల తరఫున ప్రధాన గొం తుకై నిలిచారు. ఈ పత్రికకు కృష్ణాజీరావు భాలేకర్ సంపాదకత్వం వహించారు.
రైతుల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాధారణ రైతు వేషం ధరించి ఆంగ్లేయుల పాలనలో రైతులెదుర్కొంటున్న కష్టాల్ని కన్నాట్ దొర, విక్టోరియారాణి దృష్టికి తీసుకొస్తూ ఫూలే ఆంగ్లంలో ప్రసంగించారు. జ్యోతిబా చేసిన మరొక ముఖ్యమైన పని హంటర్ కమిషన్‌కు సమర్పించిన విజ్ఞాపన. శూద్ర అతిశూద్రుల విద్య కోసం అదిక ధనాన్ని ఖర్చు చేయాలని, బ్రిటీష్ ప్రభుత్వం వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉద్యోగాలన్నీ బ్రాహ్మణుల గుత్తాధిపత్యంగా మారి పోయాయని అవిద్య వలన శుద్ర వర్ణాలు బానిసలుగా మిగిలిపోతున్నారని విజ్ఞాపన లు చేశారు.
1888 మే 11న పూనాలో పౌర సన్మానం ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ప్రజ లు ముందుకువచ్చి జోతిబాను ‘మహాత్మా’ అనే బిరుదు ఇచ్చారు. ఆ సన్మాన సభకు హాజరుకాలేకపోయిన బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్ తాను పంపిన సందేశంలో జ్యోతిబాను ‘అమెరికాలోని నీగ్రో బానిసల విద్య కోసం శ్రమించిన బూకర్ టీ వాషింగ్టన్’తో పోల్చారు. చివరి దశలో కూ డా శూద్ర అతిశూద్ర వర్ణాల విద్య కోసం శ్ర మిస్తూనే 1889 నవంబర్ 28న జ్యోతిబా తుదిశ్వాస విడిచారు.
జ్యోతిబా మాటల్లో చెప్పాలంటే అవిద్య అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం అనైతికతకు దారితీస్తుంది. అనైతికత వలన అభి వృద్ధి నశిస్తుంది. అభివృద్ధి లేకపోతే ధనం ఉండదు. ధనం లేకపోవడం వలన శూద్ర జాతులు పీడనలకు గురవుతాయి. విద్య లేకపోవడం వల్ల ప్రజలు విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కొంటారనేది ఫూలే స్పష్టంగా చె ప్పారు. మతమౌఢ్యాన్ని, సంఘ నీతిని ప్రశ్ని స్తూ ప్రజలందరి ఆలోచనలను మళ్లించిన ప్రసిద్ధుడాయన.
ఆధునిక వైతాళికుల్లో హే తువాద దృక్పథం ఉన్న ఫూలే ప్రపంచ తా త్వికులలో పోల్చదగిన మహనీయుడు, భారతదేశ సామాజిక ఉద్యమకారుడు, సమాన ప్రాతినిధ్యం, సమానత్వం సామాజిక న్యా యం కోసం సమిధైన సత్యాన్వేషి. ఆయన ద్విశత జయంతి సందర్భంగా భారతరత్న అవార్డు ప్రకటించాలి. ఫూలే పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. తెలుగు అకాడ మీ, యూనివర్సిటీలు ఆయన సమగ్ర రచనలను తెలుగు అనువాదంతో సంపుటాలుగా అందించాలి. కుల రహిత సమాజం, సామాజిక న్యాయం కోసం పోరాడిన ఫూలేకు ఇవే మనం ఇచ్చే ఘనమైన నివాళులు.
వ్యాసకర్త సెల్: 9492765358




