calender_icon.png 8 August, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పంచాయతీ’కి గులాబీ వ్యూహం!

06-08-2024 01:20:48 AM

  1. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా ప్లాన్లు
  2. పథకాల అమలులో వైఫల్యాలపై ఫోకస్
  3. రుణమాఫీ, రైతుభరోసా కొందరికేనని ప్రచారం
  4. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ప్రజల్లోకి

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ఊపందుకుంది. ప్రస్తుతం గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండటంతో ఆరు నెలలు దాటితే కేంద్రం నిధులు నిలిపి వేస్తుందన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం చేస్తుంది.

రిజర్వేషన్ల కోసం బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా కమిషన్ చర్యలు వేగం చేసింది. వారం పది రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వానికి అందిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిని ముందే పసిగట్టి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పంచాయతీ పోరుకు వ్యూహాలు రచిస్తున్నది.

పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో పరాజయం నుంచి బయటపడేందుకు ఇప్పటి నుంచే క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నది. ఎనిమిది నెలల పాలనలో రేవంత్‌రెడ్డి సర్కార్ వైఫల్యాలు, రైతు మోసాలు, ఆరు గ్యారెంటీల అమలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురిచేసి చేర్చుకోవడం, ఇటీవల శాసనసభలో వ్యవహరించిన తీరు వంటి అంశాలను ప్రజలకు వివరించేందుకు సన్నద్ధం అవుతుంది. 

కాంగ్రెస్ హామీలను ఎండగడుతూ..

రాష్ట్రంలో మొత్తం 12, 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటికి గత ప్రభుత్వం రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం తీసుకొచ్చి 2019లో అమలు చేయగా, 2024లో కూడా ఇదే రిజర్వేషన్ ఉంటుందనే అంచనాతో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టి పెట్టుకుని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను ఎండగడుతున్నారు.

రైతు రుణమాఫీ లబ్ధిని అర్హులైన పేదలకు ఇవ్వకుండా కటాఫ్ పెట్టడంతో నిజమైన పేద రైతులకు వర్తించడం లేదని.. ఈ సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో పంపిణీ చేసిన ఫించన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బందు పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఈసారి తనను గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే మరిన్ని పథకాలు ఇప్పిస్తామని వాగ్దానాలు చేస్తున్నట్టు తెలిసింది.

రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన హామీపై నిలదీయాలని సన్నద్ధం అవుతున్నారు, వృద్ధులకు రూ.4 వేల ఫించన్, మహిళలకు రూ.2500 పంపిణీ జాడలేదని వీటిపై కాంగ్రెస్ నాయకులను  ప్రశ్నించాలని ఓటర్లకు సూచిస్తున్నారు. 

ఎంత ఖర్చైనా పర్లేదు

అధికార కాంగ్రెస్‌ను స్ధానిక ఎన్నికల్లో దెబ్బతీయాలనే కసితో ఎంత ఖర్చుకైనా గులాబీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. గత ప్రభుత్వంలో  సంపాదించుకున్న డబ్బు ఈ ఎన్నికల్లో పెట్టేందుకు అనుచరుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కాగా, ప్రభుత్వం తమపై నిఘా పెడు తుందని గ్రహించి ముందుగానే ఎక్కడిక్కడ చేరవేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.