15-11-2025 01:41:07 AM
ఎన్నికల వ్యూహకర్తగా పేరున్నా.. ఓటమి
పాట్న, నవంబర్ 14: దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిశోర్(పీకే) సొంత రాష్ట్రంలో ఓడిపోయారు. తొలి ప్రయత్నంలోనే ఘోర పరాభావాన్ని చవిచూశారు. ‘చాయ్ పే చర్చా, కాఫీ విత్ కెప్టెన్’ వంటి నినాదాలు, సర్వేలు, సోషల్ మీడియా ప్రచార వ్యూహాలతో అనేక పార్టీలకు అధికారం కట్టపెట్టడంలో కీలక రోల్ పోషించిన ఆయన సొంత రాష్ట్రంలో గెల్వలేకపోయారు.
బీహార్‌లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసిన జన్‌సురాజ్ పార్టీ బోణి కొట్టలేదు. 3.5 శాతం ఓట్లతో అనేక చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. దేశ రాజకీయాల్లో రాజకీయ వ్యూహకర్తగా చక్రం తిప్పిన ప్రశాంత్‌కిశోర్.. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, పంజాబ్, ఏపీలో, బెంగాల్‌లో వినూత్న విధానాలతో దాదాపు అందర్నీ విజయాల మీద కూర్చోబెట్టిన పీకే సొంత రాష్ట్రంలో మాత్రం ఒడిపోయారు.
పోటీకి దూరంగా ఉన్న పీకే .. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని హామీలు ఇచ్చినా ఆయనను ఓటర్లు నమ్మలేకపోయారు. బలమైన నేతలు లేకపోవడం, పార్ట క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉండడం, చివరి క్షణంలో నేతలు పార్టీలు మారడం వంటివి జన్ సురాజ్ పార్టీకి ప్రతి కూలంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ, నితీశ్ కుమార్ వ్యూహాల ముందు గెలవలేకపోయారు.