తాగునీటి బోర్లను కాపాడాలని వినతి
తుంగతుర్తి, మార్చి 30: గ్రామానికి ఏళ్ల తరబడి తాగునీటిని అందిస్తున్న బోరులను రోడ్డు విస్తరణ పేరుతో తొలగించవద్దని సర్పంచ్ మరియు గ్రామ పాలకవర్గం సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్ కు వినతిపత్రం సమర్పించారు. తుంగతుర్తి నుండి వెంపటి, మానపురం గ్రామాల మధ్య రోడ్డు వెడల్పులో భాగంగా వెంపటి గ్రామ మంచినీటికి ప్రధాన జీవనాధారమైన బోరులు రోడ్డు పక్కనే ఉండడంతో సదరు కాంట్రాక్టర్ వాటిని తీసివేయాలని సూచించగా వాటిని తొలగించవద్దని జిల్లా కలెక్టర్ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రుతో పాటు వార్డు సభ్యులు వినతి పత్రం అందజేశారు.
గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న ఈ బోరులు ప్రధాన నీటి వనరుగా కొనసాగుతుందని, వీటిని తొలగిస్తే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ బోరు ద్వారా వందలాది కుటుంబాలు నీటిని పొందుతున్నాయని తెలిపారు.
రోడ్డు వెడల్పు పనులు అవసరమే అయినప్పటికీ, ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను కోరారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ బోరులను కాపాడాలని, అవసరమైతే రోడ్డు మార్గంలో స్వల్ప మార్పులు చేయాలని సూచించారు. గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు కూడా ఈ వినతికి మద్దతు తెలుపుతూ బోరులను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.




