దళారుల నుంచి డబ్బులు ఇప్పించండి సారూ..
100 మందికి పైగా రైతుల నుండి రెండు కోట్లకు పైగా లూటి
రైతుల నుండి మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేసిన దళారులు
బుక్క చిట్టీలు, చెక్కులు ఇచ్చి బురిడీ కొట్టించిన వైనం
ముగ్గురు దళారుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్య మరో ఇద్దరు పరార్
తీవ్రంగా నష్టపోతున్నామంటూ కలెక్టర్ ను వేడుకున్న రైతులు
నాగర్ కర్నూల్ జూన్ 29 (విజయక్రాంతి): రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పండించిన పంటను అమ్ముకునే క్రమంలో దళారులు తమ ధాన్యాన్ని సేకరించి డబ్బులు ఇవ్వకుండా నిండా మోసగించారని దళారుల నుండి తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల రైతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను వేడుకున్నారు.
బిజినపల్లి మండలం మంగనూరు, గంగారం, లట్టుపల్లి, వడ్డెమాన్, బిజినపల్లి, తిమ్మాజిపేట్, అవంచ తదితర గ్రామాల్లోని సుమారు వంద మందికి పైగా రైతులకు చెందిన వరి, మొక్కజొన్న పంటను అరవింద్, శివాజీ, ఎండి హాసన్ అనే దళారులు గ్రామాల్లోన్ని ఇంటింటికీ తిరిగి సేకరించారు. తేమ తరుగు పేరుతో తక్కువ ధర నిర్ణయించినా వెంటనే డబ్బులిస్తామని చెప్పడంతో నమ్మి దాన్యాన్ని కట్టబెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా సుమారు వందమందికి పైగా రైతుల నుండి రెండు కోట్లకు పైగా విలువచేసే దాన్యం డబ్బులను డ్యూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా డబ్బులివ్వమంటే తిప్పుకుని బుక్క చిట్టీలు, ఈనెల 22న తమ బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకోవాలంటూ చెక్కులు చేతిలో పెట్టారని తీరా వారి బ్యాంకులో డబ్బులు లేవని చెబుతున్నారని ఆవేదన చెందారు.
ఆ తరువాత దళారులు ఫోన్ లైన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. తీరా తమ వద్ద కొనుగోలు చేసిన దళారుల్లో హాసన్ అనే వ్యక్తి హత్య గావించబడ్డాడని మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు కూడా తమ ఆవేదన పట్టించుకోవడం లేదన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో ఫోన్ లైన్ లో మాట్లాడారు. సానుకూలంగా స్పందించి రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.






