విన్నపాలు వినవలె..
కేంద్ర మంత్రులు గడ్కరీ, ఖట్టర్‌తో రాష్ట్ర బీజేపీ ఎంపీలు భేటీ
పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేత
ఢిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటల రాజేందర్
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్‌తో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అర్వింద్ కుమార్, గొడెం నగష్ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా తమ తమ నియోజకవర్గాల్లోని పలు అంశాలు, సమస్యలపై చర్చించారు. గట్టు- ప్రధాన రహదారిపై వెహికల్ అండర్‌పాస్ నిర్మించా లని గడ్కరీకి ఎంపీ డీకే అరుణ వినతిపత్రం సమర్పించారు.
అలాగే సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ తరలించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌ను ఆమె కోరారు. కొంపల్లి ఫ్లుఓవర్, ఉప్పల్ ఫ్లు ఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో సర్వీసు రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని గడ్కరీకి ఎంపీ ఈటల రాజేందర్ వినతిపత్రం అందజేశారు. ఇలావుండగా, కేంద్రమంత్రి బండి సంజయ్ నివాసానికి ఎంపీ ఈటల రాజేందర్ వెళ్లారు.
బుధవారం ఢిల్లీలో ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు బండి సంజయ్ నివాసానికి ఈటల రాజేందర్ కూడా వెళ్లారు. అందరూ కలిసి లంచ్ చేసినట్లుగా.. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలను బండి సంజయ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మంచి సంభాషణలు ఎప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయంటూ పోస్టు చేశారు.
బీజేపీలో మాస్ లీడర్లుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలా వారు కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని లక్ష్మణ్ నివాసంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ వారి మధ్య సయోధ్య కుదిర్చిన విషయం తెలిసిందే.






